ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నంకి తరలి వెళ్ళే విషయమై తీవ్ర గందరగోళం కొనసాగుతోంది. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో రాష్ట్రానికి మూడు రాజధానుల్ని వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. అందులో ఒకటి ప్రస్తుత రాజధాని అమరావతి కాగా, ఆ అమరావతి నుంచి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అలాగే జ్యుడీషియల్ క్యాపిటల్‌ని వేరు చేస్తూ విశాఖ, కర్నూలుకి వాటిని తరలించాలన్నది జగన్ సర్కార్ సంకల్పం. అయితే, రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులు, ప్రభుత్వం తమకు హామీ ఇచ్చిన మేరకు అమరావతిని అభివృద్ధి చేసి, తమకు న్యాయం చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో త్రీ క్యాపిటల్స్ విషయమై స్టేటస్ కో కొనసాగుతోంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వెళ్ళి తీరుతుందనే ధీమా వ్యక్తం చేస్తోంది.
తాజాగా ఈ విషయమై మరోమారు స్పష్టతనిచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ. సాంకేతిక అంశాలపై న్యాయస్థానాన్ని ఒప్పించి పరిపాలనా రాజధానిని విశాఖకు తీసుకెళ్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా వుంటే, ప్రభుత్వం మారిన ప్రతిసారీ రాజధాని మారితే ఎలా.? అన్న చర్చ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతోంది. పైగా, గడచిన రెండేళ్ళలో రాజధాని పేరుతో జరిగిన అభివృద్ధి ఏమీ లేదు. దాంతో, విశాఖ అలాగే కర్నూలు నగరాల్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్.. జ్యుడీషియల్ క్యాపిటల్ పేరుతో ఎలా అభివృద్ధి చేస్తారన్న అనుమానాలైతే జనంలో కలగడం సహజమే. కోర్టు వివాదాల నేపథ్యంలో అయినా శాసన రాజధాని అమరావతి అభివృద్ధి మీద జగన్ సర్కార్ ఫోకస్ పెట్టి వుంటే, మూడు రాజధానుల నినాదానికి అది బలంగా మారే అవకాశం వుండేది.