శ్రీదేవి భర్త, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ దృష్టి మొత్తం మన సౌత్ స్టార్ హీరోల మీదనే ఉంది. కొన్నాళ్ల క్రితం వరకు హిందీలో సినిమాలు చేసుకుంటున్న ఆయన ఉన్నట్టుండి కోలీవుడ్, టాలీవుడ్ మీద దృష్టి పెట్టారు. మొదటి సినిమానే అజిత్ తో చేశారు. ‘పింక్’ సినిమాను ఆయనతో రీమేక్ చేశారు. అది మంచి హిట్టైంది. ఇప్పుడు దాన్నే పవన్ కళ్యాణ్ హీరోగా ‘వకీల్ సాబ్’ పేరుతో తెలుగు రీమేక్ చేస్తున్నారు. ఏప్రిల్ 9న విడుదలకానున్న ఈ సినిమా మీద మంచి అంచనాలున్నాయి. ఇది గనుక మంచి విజయాన్ని అందుకుంటే బోనీ కపూర్ తెలుగులో బలమైన ముద్ర వేయగలరు.
ఇక అజిత్ హీరోగా ‘వాలిమై’ సినిమాను నిర్మిస్తున్నారు బోనీ. హెచ్.వినోత్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ చిత్రం. దీనిపై అభిమానుల్లో భారీ క్రేజ్ నెలకొని ఉంది. ఇది కూడ విజయం సాధిస్తే బోనీ కపూర్ పంట పండినట్టే. అయితే ఇంతటితో అజిత్ ను వదిలేయాలని అనుకోవట్లేదు ఆయన. వీలైతే ఆయనతో ఇంకో సినిమా చేయాలని గట్టిగా ఆశిస్తున్నారు. అందుకు ఆస్కారం లేకపోలేదు అంటున్నాయి తమిళ సినీ వర్గాలు. తెలుగులో కూడ ఆయన తన నెక్స్ట్ సినిమాను స్టార్ హీరోతోనే చేస్తారనే టాక్ వినిపిస్తోంది. చూడబోతే బోనీ కపూర్ తెలుగు స్టార్ హీరోలను అంత ఈజీగా వదిలేలా కనిపించట్లేదు.