బీజేపీ, జనసేన మధ్య బలహీనపడ్తున్న స్నేహ బంధం.!

భారతీయ జనతా పార్టీకీ, జనసేన పార్టీకీ మధ్య బంధం క్రమక్రమంగా బలహీన పడుతోంది. తెలంగాణలో అయితే జనసేనను బీజేపీ అస్సలు పట్టించుకోవడంలేదు. ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే పరిస్థితి. బద్వేలు ఉప ఎన్నిక నేపథ్యంలో రెండు పార్టీల మధ్య గ్యాప్ మరింత పెరిగిపోయినట్లే కనిపిస్తోంది.

‘మేం బీజేపీకి సహకరిస్తాం..’ అని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రకటించినా, బీజేపీ మాత్రం.. బద్వేలు ఉప ఎన్నికలో జనసేన పోటీ చేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. నిజానికి, బద్వేలు ఉప ఎన్నిక జనసేనకు అందివచ్చిన అత్యద్భుతమైన అవకాశం. ఈ ఉప ఎన్నికలో జనసేన పోటీ చేసి వుంటే, గెలుపోటముల సంగతి తర్వాత, బీజేపీ తమకెంతవరకు సహకరిస్తుందో తేలిపోయేది.

మరోపక్క, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన బలం ఎంత.? అన్న విషయమై బద్వేలు ఉప ఎన్నికతో జనసేన పార్టీకి ఓ అవగాహన వచ్చి వుండేది. గెలవకపోవడం వల్ల జనసేనకు అదనంగా వచ్చిన నష్టమేమీ లేదు. పైగా, టీడీపీ ఓటు ఎంతోకొంత జనసేన వైపు అడ్జస్ట్ అయి వుండేది.. అది అదనపు లాభం జనసేనకి.

ఇంత అద్భుతమైన అవకాశాన్ని జనసేన వదులుకోవడం బీజేపీకి కాస్త నొప్పి పుట్టేలా చేస్తోంది. పోటీ చేయకపోవడంపై జనసేనాని ప్రకటన, ఆ తర్వాత అదే బాటలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటన వెరసి.. టీడీపీ – జనసేన ఒకే బాటలో వున్నాయనే నమ్మకం బీజేపీకి కలుగుతోంది.

ఇదే విషయాన్ని కొందరు బీజేపీ నేతలు, తమ అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్ళారట. టీడీపీ – జనసేన కలిసే ప్రసక్తే లేదని జనసేన చెబుతున్నా, టీడీపీ మాత్రం.. ఎప్పటికైనా జనసేన తమ దారిలోకి రావాల్సిందేనని అంటూ, జనసేనను ర్యాగింగ్ చేస్తుండడం గమనార్హం.

బద్వేలు ఉప ఎన్నికలో ఎటూ బీజేపీ ఓడిపోతుంది. ఆ నెపాన్ని జనసేన మీదకు నెట్టేసి.. జనసేనను వదిలించుకోవాలన్నది బీజేపీ తాజా వ్యూహంగా కనిపిస్తోంది. బీజేపీ కూడా జనసేనను వదిలేస్తే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమిటో.?