క్లిక్కు.! బ్లూ టిక్కు.! జేబుకి చురుక్కు.!

మీది ట్విట్టర్‌లో బ్లూ టిక్కెట్ వున్న ఖాతానా.? అయితే, ఇకపై మీ జేబుకి షాక్ తగలబోతోంది. నెలకు 20 డాలర్ల చొప్పున ఇకపై బ్లూ టిక్ వున్న అక్కౌంట్ల నుంచి వసూలు చేయనుందట ట్విట్టర్. ఇప్పటిదాకా నెలకి సుమారుగా 410 రూపాయలుగా వున్న ఈ ధర ఇకపై 1600 ఆ పైన వుండబోతోందిట.!
ప్రపంచంలో ఏదీ ఉచితంగా దొరకదు.! ఉచితంగా దొరుకుతుందని అనుకుంటామంతే. సోషల్ మీడియాలో అంతా ఫ్రీ కాదు. ఇంటర్నెట్ కనెక్షన్ వుంటే.. అది ఫ్రీ. మళ్ళీ ఇక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ ఫ్రీ కాదు. కాకపోతే, తక్కువ ఖర్చుతోనే ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చేసింది. అదీ అసలు సంగతి.

సోషల్ మీడియా అయితే ప్రస్తుతానికి ఫ్రీ. అది కూడా ముందు ముందు ఖరీదైన వ్యవహారం కాబోతోంది. ప్రపంచం సాంకేతికంగా కొత్త పుంతలు తొక్కుతున్న దరిమిలా, ప్రతి ఒక్కరూ సామాజిక మాధ్యమాలకు అడిక్ట్ అయిపోతున్నమాట వాస్తవం.

ప్రపంచమంతా సోషల్ మీడియా పుణ్యమా అని గుప్పిట్లోనే వుంటోంది. అయితే, ఆ సోషల్ మీడియా ముందు ముందు వినియోగదారులకు షాక్‌ల మీద షాక్‌లు ఇవ్వబోతోంది. ‘ఏదీ ఉచితం కాదు..’ అని బలంగా నమ్మే ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్, ట్విట్టర్ సొంతం చేసుకున్నాక.. దాన్ని ‘ఉచితం’ కేటగిరీ నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ప్రస్తుతానికి షాక్ ‘బ్లూ టిక్’ అక్కౌంట్లకే అయినా, ముందు ముందు సాధారణ వినియోగదారులకు కూడా ఎలాన్ మస్క్ షాక్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. అదే బాటలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ పయనిస్తే, ఆల్రెడీ యూ ట్యూబ్.. ప్రీమియమ్ యూజర్లంటూ కాసులు పిండుకునే వ్యవహారం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.