ఆంధ్రాలో మెజారిటీ మీడియా వ్యవస్థ రెండు ప్రధాన పార్టీల నడుమ చీలిపోయి ఉన్న సంగతి తెలిసిందే. వీటికి జనం పెట్టుకున్న మారు పేర్లే ఎల్లో మీడియాయా, బ్లూ మీడియా. ఎల్లో మీడియా వైసీపీని బద్నాం చేయాలనుకుంటే బ్లూ మీడియా టీడీపీని తొక్కేయాలకుంటుంది. ఎల్లో మీడియా పైత్యం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పనక్కర్లేదు. చంద్రబాబును వీరుడి సూరుడు అంటూ ఆకాశానికెత్తేస్తుంటుంది. జగన్ మీద నెగెటివ్ ప్రోపగాండ చేస్తుంటుంది. ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయాక కూడ అది కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు దీనికి ధీటుగా తయారైంది బ్లూ మీడియా. వీరిది కూడ సేమ్ ఎజెండానే. జగన్ ను ఎత్తడం, చంద్రబాబును కూల్చడం.
ఈ ప్రాసెస్లో ఎల్లో మీడియా కంటే బ్లూ మీడియా రెండు ఆకులు ఎక్కువ చదివినట్టే ఉంది. ఎల్లో మీడియాకు పెద్ద పెద్ద విషయాలనే ఏమార్చడం తెలిసు. కానీ బ్లూ మీడియా అలా కాదు. చిన్న చిన్న విషయాల్లో కూడ బూచిని చూపిస్తోంది. ముఖ్యంగా బులుగు రంగు వేసుకున్న వెబ్ మీడియా వర్గం ఒకటి టీడీపీలో జరిగే చిన్నపాటి విషయాలను కూడ పెద్దవిగా చేసి నెగెటివిటీ పుట్టించేస్తున్నాయి. ప్రతిపక్ష నేత ఏం మాట్లాడినా అది తప్పన్నట్టు చూపిస్తూ పాలకవర్గం నేతల తీరును హీరోయిజంలా ఎలివేట్ చేస్తున్నాయి. తాజాగా తెలుగుదేశం పార్టీలో జరిగిన ఒక విషయాన్ని బ్లూ మీడియా వక్రీకరించిన తీరు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.
నిన్న బుధవారం తిరుపతిలో టీడీపీ ఎన్నికల పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఆ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. అసలే ఉపఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో తిరుపతి ముఖ్య నేతలంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కానీ ఎన్నికల అభ్యర్థి పనబాక లక్ష్మి మాత్రం వెళ్ళలేదు. ఆమె వెళ్ళకపోవడం పెద్ద విషయమే అయినా ఆ వెళ్లకపోవడానికి గల కారణమే ఆ విషయాన్ని పెద్దదా చిన్నదా అనేది డిసైడ్ చేస్తుంది. బ్లూ మీడియా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ పనబాకకు టీడీపీలో ఉండటం ఇష్టంలేదని, త్వరలో పార్టీని వీడతారని, అందుకే పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి రాకపావడమే నిదర్శనమని ప్రచారం చేశారు. పనబాక లక్ష్మి ఆ కార్యక్రమానికి ఎందుకు వెళ్ళలేదు తెలియనివారు దాన్నే నిజం అనుకుంటారు.
కానీ వాస్తవం చూస్తే పార్టీ కార్యాలయం ఓపెనింగ్ రోజునే పనబాక కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమం ఉంది. ఎంత పార్టీ కార్యక్రమమైనా కుమార్తె పెళ్లి రిసెప్షన్ ను వదిలేసి వెళ్లేంత ముఖ్యమైన పనైతే కాలేదు. కాబట్టే ఆమె తన కుమార్తె వేడుకలో ఉండి పార్టీ ఎన్నికల ఆఫీస్ ప్రారంభోత్సవానికి వెళ్ళలేదు. ఆ కార్యక్రమం అచ్చెన్నాయుడు చేతుల మీదుగా జరిగిపోయింది. ప్రారంభోత్సవం తర్వాత అచ్చెన్నాయుడు కూడ పనబాక లక్ష్మి కుమార్తె రిసెప్షన్ వేడుకకు వెళ్లారు. అయితే ఈ విషయాన్ని దాచిపెట్టేసిన బ్లూ మీడియా పనబాక ముఖ్యమైన పార్టీ కార్యక్రమాన్ని ఎగ్గొట్టారు, అచ్చెన్నాయుడు వచ్చినా వెళ్ళలేదు, ఆమెకు పార్టీలో ఉండటం ఇష్టంలేకనే అలా చేశారు, త్వరలో పార్టీని వదిలేస్తారు అంటూ ప్రజెంట్ చేసింది.