కాబూల్‌ మసీదులో ఆత్మాహుతి దాడి..66 మంది మృతి…

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌ మరోమారు రక్తమోడింది. ఓ మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడి పేలుడులో 66 మంది మృతి చెందారు. చాలా మంది గాయపడ్డారు. రంజాన్ చివరి శుక్రవారం సందర్భంగా ప్రార్థనల కోసం ఖలీఫా సాహిబ్ మసీదుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అదే సమయంలో ఓ ఉగ్రవాది తనను తాను పేల్చేసుకోవడంతో భారీ పేలుడు సంభవించింది. దీంతో అప్పటి వరకు సందడిగా ఉన్న మసీదు ఒక్కసారిగా రక్తమోడింది. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. సున్నీ ముస్లింలే లక్ష్యంగా జరిగిన ఈ పేలుడులో ఇప్పటి వరకు 66 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 78 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.

పేలుడుకు సంబంధించి ఇప్పటి వరకు ఏ సంస్థా బాధ్యత ప్రకటించలేదు. ఈ పేలుడుపై భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నట్టు కాబూల్ పోలీస్ చీఫ్ ప్రతినిధి ఖలీద్ జద్రాన్ పేర్కొన్నారు. కాగా, పేలుడు కారణంగా మసీదు పైకప్పు కూలిపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన ఐక్యరాజ్య సమితి నిత్యం హింసకు గురవుతున్న ఆఫ్ఘన్ ప్రజలకు ఇది మరో బాధాకరమైన ఘటన అని విచారణ వ్యక్తం చేసింది.