తాలిబన్ టెర్రరిస్టుల చేతికి అమెరికా ఆయుధాలు.. తప్పెవరిది.?


తాలిబన్లు ఆప్ఘనిస్తాన్‌ పాలని తమ చేతుల్లోకి తెచ్చుకోవడం ప్రపంచానికి ఎలా ప్రమాదకరంగా మారుతుంది.? అన్న ప్రశ్న చాలామంది మెదళ్ళలో మెదులుతుండొచ్చుగాక. కానీ, పిచ్చోడి చేతిలో రాయి వున్నప్పుడు.. అందరూ భయపడాల్సిందే. మరి, టెర్రరిస్టు చేతిలో అత్యాధునిక ఆయుధ సంపత్తి వుంటేనో.! ప్రపంచం వణికి తీరాల్సిందే. అదే జరుగుతోందిప్పుడు. యుద్ధ సమయంలో వాడే పోరాట హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు.. బోల్డన్ని వున్నాయిప్పుడు తాలిబన్ల చేతిలో. వాటికి తోడు, ప్రపంచంలోనే అత్యాధునికమైన మెషీన్ గన్లు, యుద్ధ ట్యాంకులు, గ్రెనేడ్ లాంఛర్లు, రాకెట్లను పేల్చేవి.. తాలిబన్ల చేతికి చిక్కాయి. రెండు దశాబ్దాలపాటు అమెరికా, ఆప్ఘనిస్తాన్‌ని ఏం ఉద్ధరించింది.?

అన్న విషయాన్ని పక్కన పెడితే, ఇప్పుడు ప్రపంచానికే పెను ముప్పుగా ఆప్ఘనిస్తాన్‌ని అమెరికా మలచినట్లయ్యిందన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. పాకిస్తాన్ కావొచ్చు, చైనా కావొచ్చు.. తాలిబన్లతో చేతులు కలిపే అవకాశం వుంది కాబట్టి, వాటికి పెద్దగా ప్రమాదం వుండదు. కానీ, భారతదేశం పరిస్థితే అయోమయంలో పడిందిప్పుడు. తాలిబన్లు ఇప్పటికే, భారత వ్యతిరేక శక్తులతో చేతులు కలపడం షురూ చేశారు. దాంతో, ఆప్ఘనిస్తాన్‌లో భారత వ్యతిరేక కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. తాలిబన్ల చేతిలోని ఆయుధాల్ని భారతదేశంపైకి తీవ్రవాదులు ప్రయోగిస్తే.? ఈ వాదనను కొట్టి పారేయలేం అని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. అయితే, భారత్ ఏనాడూ ఆప్ఘాన్ వ్యతిరేక చర్యలకు పాల్పడలేదు. దాంతో, మరీ అంత ప్రమాదం తాలిబన్ల నుంచి భారత్ వైపు వుండకపోవచ్చన్నది ఇంకో వాదన. ముందే చెప్పుకున్నాం కదా, పిచ్చోడి చేతిలో రాయి.. టెర్రరిస్టు చేతిలో వెపన్ అని. కాబట్టి, భారత్ ఒకింత అప్రమత్తంగా వుండాల్సిందే మరి ఆప్ఘాన్ తాలిబాన్ల విషయంలో.