హాలీవుడ్ సినిమాని తలపిస్తోన్న ఆప్ఘనిస్తాన్ కష్టాలు.!

ఓ హాలీవుడ్ సినిమాలో హీరో అర్నాల్డ్, విలన్ల నుంచి తప్పించుకునేందుకు.. విమానం ల్యాండింగ్ గేర్ (చక్రాల) ద్వారా గాల్లోంచి కిందికి దూకేస్తాడు. అప్పట్లో ఆ సన్నివేశం ఓ సంచలనం. ఇదే సన్నివేశాన్ని ఓ తెలుగు సినిమాలో కూడా కాపీ కొట్టేశారు. అర్జున్ హీరోగా వచ్చిన ‘జైహింద్’ సినిమా అది. ఆప్ఘనిస్తాన్‌లో ఇప్పుడు ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. తాలిబన్లు, ఆప్ఘనిస్తాన్‌లో అధికారాన్ని దక్కించుకోవడంతో, అక్కడి పౌరులు, అక్కడ ఇన్నాళ్ళూ వున్న విదేశీయులు.. వేరే దేశాలకు వెళ్ళేందుకు విమానాశ్రయం వైపు దూసుకెళ్ళారు. విమానాశ్రయం మన దేశంలో బస్ స్టాండ్ల కంటే దారుణంగా తయారయ్యాయి. లేకపోతే, రన్ వే మీద కదులుతున్న విమానంలోకి ఎక్కేందుకు జనం ప్రయత్నించడమేంటి.? విమానం రెక్కలు పట్టుకుని, విమానం చక్రాలు పట్టుకుని వేలాడటమేంటి.? ఈ క్రమంలో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు.

విమానం గాల్లోకి లేవంగానే, అప్పటిదాకా విమానాన్ని అంటిపెట్టుకుని వున్నవాళ్ళు గాల్లోంచి పిట్టల్లా కిందికి రాలిపోతున్నారు.. ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆప్ఘనిస్తాన్‌లో అక్కడి సైనికులకు, ప్రభుత్వానికి ఇన్నాళ్ళు అండగా నిలిచిన అమెరికా, తమ బలగాల్ని ఉపసంహరించుకోవడంతోనే ఈ దుస్థితి దాపురించింది. ‘మేం ఎవరినీ హింసించం, బాధ పెట్టం..’ అని తాలిబన్ నేతలు చెబుతున్నా, అక్కడ వందల మంది వేల మంది నిత్యం తాలిబన్ల చేతిలో ప్రాణాలు కోల్పోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అక్కడ మీడియా సైతం సరిగ్గా పని చేయలేని దుస్థితి. సినిమాల్లో హింస చాలా చిన్నది.. అన్నట్టు తయారైంది ఆప్ఘనిస్తాన్ పరిస్థితి. ఈ ప్రభావం భారతదేశంపై పడుతుందా.? తాలిబన్లు, భారతదేశంలోకి తీవ్రవాదుల్ని పొపించే అవకాశం వుంటుందా.? అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయిప్పుడు.