నల్లటి దారం.. నల్లటి దుస్తులు.. అందరూ ధరించకూడదంట.. ముఖ్యంగా ఈ రెండు రాశులవారు..!

జ్యోతిష్యశాస్త్రంలో రంగులకు ఉన్న ప్రాధాన్యత ఎంతో ఉంది. అందులోనూ నలుపు రంగుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆధునిక కాలంలో ఫ్యాషన్‌లో భాగంగా నలుపు రంగు వాచీలు, దుస్తులు, యాక్ససరీలు విపరీతంగా ప్రాచుర్యం పొందాయి. అలానే నరదృష్టి నుంచి రక్షణ కోసం చేతికి లేదా కాలికి నల్లటి దారం కట్టుకోవడం చాలా మంది ఆచరిస్తున్నారు. కానీ జ్యోతిష్యుల మాట ప్రకారం, ఈ నలుపు రంగు అందరికీ శుభప్రదం కాదని చెబుతున్నారు.

శని గ్రహానికి నలుపు రంగుతో గాఢమైన సంబంధం ఉంది. ఎవరి జాతకంలో అయితే శని బలంగా ఉంటాడో, ఆ వ్యక్తులకు ఈ రంగు అద్భుత ఫలితాలను ఇస్తుందని పండితులు అంటున్నారు. కానీ శని బలహీనంగా ఉన్నవారికి ఈ రంగు ప్రతికూల ఫలితాలను కూడా ఇవ్వగలదు. ఉజ్జయిని చెందిన జ్యోతిష్య పండితుడు ఆనంద్ భారద్వాజ్ చెప్పిన వివరాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి.

ముఖ్యంగా రెండు రాశుల వారు నలుపు రంగును సాధ్యమో దూరంగా ఉంచాలని ఆయన సూచిస్తున్నారు. మేష రాశి వారికి అధిపతి కుజుడు, శని గ్రహంతో సహజ శత్రుత్వం కలిగి ఉన్నాడు. ఈ కారణంగా మేష రాశి వారు నల్లటి దుస్తులు, నల్లటి దారం లేదా నలుపుతో సంబంధం ఉన్న ఏ వస్తువూ వాడితే జీవనంలో ఆటంకాలు, మానసిక ఒత్తిడి, అనుకోని సమస్యలు తలెత్తే ప్రమాదం ఎక్కువ అని చెబుతున్నారు.

ఇదే పరిస్థితి వృశ్చిక రాశి వారికి కూడా వర్తిస్తుంది. ఈ రాశికి అధిపతి కూడా కుజుడే కావడంతో శని ప్రభావం ప్రతికూలంగా మారే అవకాశం ఉందని జ్యోతిష్యులు హెచ్చరిస్తున్నారు. వృశ్చిక రాశి వారు చేతికి లేదా కాలికి నల్లటి దారం కట్టుకోవడం మాత్రం పూర్తిగా నివారించాలని వారు సూచిస్తున్నారు. ఈ రెండు రాశుల వారు నలుపు రంగును ఎంత తక్కువగా ఉపయోగిస్తే అంత మంచిది అని పండితులు అంటున్నారు.

పురాణాల్లో శనిదేవుడి జన్మగాథలో కూడా నలుపు రంగు ప్రస్తావన ఉంది. తన నల్లని వర్ణం కారణంగా జన్మించిన రోజునే ఎవరూ తనను పట్టించుకోలేదన్న బాధ ఆయనకు కలిగిందని పురాణాలు చెబుతాయి. ఆ రోజు నుంచి నలుపు రంగుని తన ప్రియమైన రంగుగా ప్రకటించి, ఈ రంగుకు గౌరవం లభించాలని ఆశీర్వదించాడని కథనం ఉంది. అందుకే శనిదేవునికి నల్లనువ్వులు, నల్లటి బట్ట, నునె, నల్లటి దారం వంటి వస్తువులను సమర్పించడం ఆనవాయితీ అయింది.

శని శుభస్థితిలో ఉన్నవారు నలుపు రంగును మితంగా ఉపయోగిస్తే జీవితంలో స్థిరత్వం, ఆత్మవిశ్వాసం, సానుకూల శక్తులు పెరుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ప్రతికూల స్థితిలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిస్తున్నారు. ఖచ్చితంగా ఏ రంగు ఉపయోగించాలి, ఏ రంగును దూరం పెట్టాలి అన్నది వ్యక్తిగత జాతకాన్ని బట్టి మాత్రమే నిర్ణయించాలి.