కరోనా తగ్గుతోంది.. బ్లాక్ ఫంగస్ భయపెడుతూనే వుంది

Black Fungus Becoming Big Threat

Black Fungus Becoming Big Threat

దేశంలో కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్న విషయం విదితమే. డెల్టా ప్లస్ వేరియంట్ భయాల నడుమ, కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతుండడం ఊరట కలిగించే అంశమే. కానీ, దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు భయపెడుతున్నాయి. 40 వేలకు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు ఇప్పటిదాకా వెలుగు చూశాయి.

అధికారిక లెక్కలకీ, అనధికారిక లెక్కలకీ అస్సలు పొంతన లేదంటూ కరోనా పాజిటివ్ కేసుల విషయంలోనే పలు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. బ్లాక్ ఫంగస్ విషయంలో ఈ భయాలు ఇంకా ఎక్కువగా కనిపిస్తుండడం గమనార్హం. నిజానికి, కరోనా వైరస్ కంటే.. బ్లాక్ వైరస్ చికిత్సలో వాడే మందుల ఖర్చు ఎక్కువన్న ప్రచారం జరుగుతోంది.

పైగా, ఈ మందుల లభ్యత మరింత కష్టసాధ్యంగా మారిపోయిది. అయితే, ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. బ్లాక్ ఫంగస్సూ లేదు.. బ్లూ ఫంగస్సూ లేదు.. యెల్లో ఫంగస్సూ లేదు.. వైట్ ఫంగస్సూ లేదంటూ లైట్ తీసుకున్నారు. మీడియా ఉత్తుత్తి కథనాలతో జనాన్ని భయపెట్టేస్తోందంటూ ఎగతాళి చేశారు.

వాస్తవానికి కరోనా వైరస్ కూడా తెలంగాణలో పూర్తిగా అదుపులోకి వచ్చేయలేదు. రోజువారీ కేసుల సంఖ్య వెయ్యికి అటూ ఇటూగా నమోదవుతోంది. కరోనా వైరస్ సోకినవారిలో చాలామందికి బ్లాక్ ఫంగస్ ముప్పు వుంటోందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఆ లెక్కన, బ్లాక్ ఫంగస్ కేసులు నిత్యం వెలుగు చూస్తున్నట్లే భావించాలేమో. ఆంధ్రపదేశ్ సంగతి సరే సరి. అక్కడా ప్రభుత్వ లెక్కలకీ, వాస్తవ లెక్కలకీ పొంతన వుందా.? లేదా.? అన్నదానిపై రకరకాల వాదనలున్నాయి. ఏమో, ఈ ముప్పు పూర్తిగా ఎప్పుడు తొలగుతుందోగానీ, ప్రభుత్వాలు చెప్పే మాటల్ని ప్రజలు విశ్వసించే పరిస్థితి మాత్రం కనిపించడంలేదు.