BJP’s Money Politics : రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి విషయంలో కేంద్రంలోని మోడీ సర్కార్ పనితనాన్ని అభినందించాల్సిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఈ విషయమై అభినందించారు, కృతజ్ఞతలు కూడా తెలిపారు. రాష్ట్ర రహదారుల్ని జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయమని కూడా కోరారు ముఖ్యమంత్రి. అందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించార కూడా.
రాష్ట్రంలో మూడు లక్షల కోట్లతో రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు (జాతీయ రహదారులకు సంబంధించి) చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పుకున్నారు. మంచిదే.. కానీ, పోలవరం ప్రాజెక్టు సంగతేంటి.? కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమావేశంలో మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తమ పాలనలో కేంద్రం అభివృద్ధి పథంలో దూసుకెళుతోందని సెలవిచ్చారు. రాష్ట్రాలకు కేంద్రం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తోందని చెప్పుకొచ్చారు.
కానీ, పోలవరం ప్రాజెక్టు మాటేమిటి.? దాదాపు ఎనిమిదేళ్ళ నరేంద్ర మోడీ పాలనలో, జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ఎందుకు పూర్తి కాలేకపోయింది.? విభజన చట్టం ప్రకారం కేంద్రమే పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలి. అయితే, పోలవరం ప్రాజెక్టు బాధ్యతను రాష్ట్రానికి అప్పగించి, ‘నిధులు మేం విడుదల చేస్తాం.. పనులు మీరు చేయండి..’ అని చేతులు దులుపుకుంది కేంద్రం.
రాష్ట్రం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పనులు చేస్తున్నా, కేంద్రం సకాలంలో నిధుల్ని విడుదల చేయడంలేదు. దాంతో, పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు తయారైంది. జాతీయ రహదారుల విషయమై ఖర్చు చేస్తామంటోన్న 3 లక్షల కోట్లలో జస్ట్ కొన్ని వేల కోట్లు వెచ్చిస్తే, పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోతుంది కదా.?