పెండింగ్ ప్రాజెక్టులపై ఏపీ బీజేపీకి కొత్త ప్రేమ.!

అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై భారతీయ జనతా పార్టీకి వున్న అవగాహన ఏంటి.? ఆ పార్టీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల ఎలాంటి బాధ్యత కలిగి వున్నారు.? ఈ విషయాలపై రాష్ట్ర ప్రజలకు ఖచ్చితమైన అవగాహన వుంది కాబట్టే, రాష్ట్రంలో బీజేపీకి ఆస్కారమే లేదని 2019 ఎన్నికల్లో తేల్చి పారేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీతో జతకట్టిన బీజేపీ, నాలుగేళ్ళు.. ఆ పార్టీతో కలిసి రాష్ట్రంలో అధికారం పంచుకుంది. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదు. రైల్వే జోన్ ఓ కొలిక్కి రాలేదు. ఇలా బీజేపీ ఫెయిల్యూర్స్, ఆంధ్రప్రదేశ్ విషయంలో చాలానే వున్నాయి. ఇప్పుడేమో, 30 ఏళ్ళుగా పెండింగులో వున్న ప్రాజెక్టుల్ని వెంటనే పూర్తి చేసెయ్యాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసేశారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. ఈ డిమాండుతోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టబోతోందట బీజేపీ. నవ్విపోదురుగాక.. అన్నట్టుంది పరిస్థితి.

కేంద్రం, గడచిన ఏడేళ్ళుగా పోలవరం ప్రాజెక్టుని నాన్చుతూ వస్తోంది. లేకపోతే, ఈపాటికే ప్రాజెక్టు పూర్తయ్యేది. చంద్రబాబు హయాంలో పూర్తవ్వాల్సిన జాతీయ ప్రాజెక్టు.. ఆ తర్వాత ఇంకో రెండేళ్ళు.. ఆ పైన సాగతీతకు గురవుతోందంటే, కారణం కేంద్రం ఇవ్వాల్సిన స్థాయిలో నిధులు ఇవ్వకపోవడమే. ఆ రైల్వే జోన్ గురించీ, ఆ ప్రత్యేక హోదా గురించీ, ఆ కడప స్టీలు ప్లాంటు గురించీ, ఆ విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ గురించీ.. ఆ దుగరాజపట్నం పోర్టు గురించీ, ఆ అమరావతి గురించీ.. బీజేపీ నేతలు తమ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి, రాష్ట్రానికి మేలు చేయాలి తప్ప, రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాడి ఏం సాధిస్తారు.? ఏపీలో టీడీపీని చెడగొట్టి, బీజేపీ కూడా చెడిపోయింది. బాగుపడే లక్షణాలు ఏమాత్రం బీజేపీలో కనిపించడంలేదు, కనిపించవు కూడా. ఎందుకంటే, రాష్ట్ర పరిస్థితుల్ని కేంద్రానికి వినిపించేంత చిత్తశుద్ధి ఏపీ బీజేపీ నేతలకు లేదు.