బద్వేలులో బీజేపీ పోరు: కానీ, ఎందుకు.?

కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికకు సంబంధించి టీడీపీ, జనసేన ఇప్పటికే చేతులెత్తేశాయ్. కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే బరిలోకి దిగుతున్నారు. బీజేపీ నుంచి అభ్యర్థి బరిలో వుంటారు. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య సతీమణి బరిలోకి దిగుతున్న విషయం విదితమే.

వైసీపీ గెలుపు బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించి నల్లేరు మీద నడకే. అస్సలేమాత్రం వైసీపీకి పోటీ వుండదు. కానీ, బీజేపీ.. తాము గట్టి పోటీ ఇచ్చేస్తామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. కాంగ్రెస్ పార్టీది ఉనికి కోసం ఆరాటం తప్ప, పోటీ చేసి కనీసం డిపాజిట్ తెచ్చుకునే పరిస్థితి కూడా వుండదు.

ఇదిలా వుంటే, బద్వేలు ఉప ఎన్నిక ప్రచారం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌‌ని పిలుస్తామని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెబుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మరణంతో, వైసీపీ నుంచే ఆయన భార్య స్వయంగా పోటీ చేస్తున్న దరిమిలా, తాము బరిలోకి దిగడం సబబు కాదన్నది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాదన.

బద్వేలు ఉప ఎన్నికలో ఎందుకు పోటీ చేయడంలేదో జనసేనాని అంత స్పష్టంగా చెప్పాక, ఇంకా జనసేన నుంచి సాయం ఆశించడమే బీజేపీ చేస్తోన్న పెద్ద తప్పిదం. అయినా, బీజేపీతో సంప్రదించకుండా, ‘మేం పోటీలో వుండడంలేదు’ అని జనసేనాని ఎలా ప్రకటించేశారట.?

సరే, జనసేన చేతులెత్తేసింది.. తిరుపతి ఉప ఎన్నిక ఫలితం తర్వాత అయినా, బీజేపీ తన బలం గురించి తెలుసుకుని పోటీలోకి దిగాలి కదా.? ఏమో, ఈ బీజేపీ వ్యూహాలు ఎలా వుంటాయో ఊహించడం కష్టం. బీజేపీకి ఆంధ్రప్రదేశ్‌లో ఓట్లు రావడం ఇంకా ఇంకా కష్టం.