అనుకున్నట్టుగానే జరిగింది. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలు తెలంగాణ రాజకీయాలనే మార్చేశాయి. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ ఘన విజయం సాధించింది. అధికార టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ షాక్ ఇచ్చింది. అధికార పార్టీ రెండో స్థానంలో నిలవగా… కాంగ్రెస్.. మూడో స్థానంలో నిలిచింది.
బీజేపీ గెలుపు ఖాయం కావడంతో బీజేపీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ నుంచి దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు పోటీ చేయగా… టీఆర్ఎస్ నుంచి దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత పోటీ చేశారు. అయితే ప్రధానంగా పోటీ కూడా ఈ రెండు పార్టీల మధ్యనే ఉండగా… స్వల్ప తేడాతో బీజేపీ అభ్యర్థి విజయదుందుబి మోగించాడు.
మొదటి రౌండ్ కౌంటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి బీజేపీ అభ్యర్థి లీడ్ లో ఉన్నారు. మధ్యలో కొన్ని రౌండ్లలో టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం కనబరిచినప్పటికీ.. చివరకు బీజేపీ పైచేయి సాధించింది. దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీ రెండో స్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.