దుబ్బాక ఉప ఎన్నిక ఊహించని ఫలితాన్ని అందించింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీని బీజేపీ మట్టికరిపించింది బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు.. 1470 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే.. 2018 ఎన్నికల్లో ఇదే దుబ్బాక నుంచి పోటీ చేసిన రఘునందన్ రావు సోలిపేట చేతిలో ఓడిపోయారు. అప్పుడు సోలిపేట.. టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి 65 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు.. మూడో స్థానంలో నిలిచారు.
కానీ.. కేవలం రెండేళ్లలోనే పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు ఈసారి దుబ్బాక ప్రజలు పట్టం కట్టారు. భారీ మెజారిటీ రాకున్నా… 1470 ఓట్ల మెజారిటీతో రఘునందన్ రావు గెలుపొంది కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు.
మొత్తం 23 రౌండ్లలో కౌంటింగ్ జరగగా… దాదాపు అన్ని రౌండ్లలో రఘునందన్ రావే ఆధిక్యంలో కొనసాగారు. మధ్యలో కొన్ని రౌండ్లలో మాత్రమే టీఆర్ఎస్ ఆధిక్యం కనబరిచింది.
ఇక.. దుబ్బాకలో బీజేపీకి 62,773 ఓట్లు రాగా… టీఆర్ఎస్ పార్టీకి 61,302 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి సుమారు 21,819 ఓట్లు పోలయ్యాయి. దుబ్బాక నియోజకవర్గం మొత్తం మీద 1,62,516 ఓట్లు పోలయ్యాయి.