బీజేపీ, వైఎస్సార్సీపీ.. ఏది తోక పార్టీ.?

భారతీయ జనతా పార్టీని తోక పార్టీగా అభివర్ణించారు మంత్రి సీదిరి అప్పలరాజు. మంత్రిగారి వ్యాఖ్యలు సహజంగానే బీజేపీ నేతలకు ఆగ్రహం తెప్పిస్తాయి.. తెప్పించాయి కూడా. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, మంత్రి సీదిరి అప్పలరాజు తీరుపై గుస్సా అయ్యారు. ‘తోక పార్టీ మాది కాదు.. మేం 18 రాష్ట్రాల్లో అధికారంలో వున్నాం.. మా పార్టీ పెద్దల దగ్గరకు వెళ్ళి మీరు వంగి వంగి దండాలు పెడుతున్నారు.. మీది తోక పార్టీనా.? మాది తోక పార్టీనా.? మీ తోకలు కత్తిరించే రోజు త్వరలోనే వస్తుంది..’ అంటూ సోము వీర్రాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడిపోయారు. ఇంతకీ, తోక పార్టీ ఏది.? నిజమే, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పినట్లు, దేశంలో బీజేపీ చాలా బలమైన పార్టీ. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. కానీ, సోము వీర్రాజు అంటున్నట్లు.. వైసీపీ నేతలు, బీజేపీ పెద్దల దగ్గర వంగి వంగి దండాలేమీ పెట్టడంలేదు.

కేంద్ర ప్రభుత్వం – రాష్ట్ర ప్రభుత్వం మధ్య సత్సంబంధాలు వుండాలి కాబట్టి, అది దేశానికీ.. రాష్ట్రానికి మంచిది కాబట్టి.. రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రుల్ని కలుస్తారు. అదీ అసలు విషయం. ఈ మాత్రం పరిజ్ఞానం కూడా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకి లేకపోతే ఎలా.? ఏపీలో బీజేపీ తోక పార్టీనే.. ఎందుకంటే, సొంతంగా ఆ పార్టీకి రెండు సీట్లు కూడా వచ్చే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు. అసలు డిపాజిట్లు అయినా వచ్చే ఎన్నికల్లో బీజేపీకి వస్తాయో రావో డౌటే. సరే, రాజకీయాల్లో గెలుపోటములనేవి సహజం అనుకోండి.. అది వేరే సంగతి. రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన అంశాల్లో కేంద్రాన్ని ఒప్పించలేని అసమర్థత ఏపీ బీజేపీ నేతలది. విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణను ఆపగలుగుతున్నారా.? ప్రత్యేక హోదాని తీసుకురాగలుగుతున్నారా.? అంతెందుకు, మిత్రపక్షం జనసేనతోనే రాజకీయ సఖ్యత కొనసాగించలేని దుస్థితి ఏపీ బీజేపీది. చంద్రబాబు ఎలా ఆడిస్తే అలా ఆడుతోంది బీజేపీ.. అనడానికి సాక్ష్యాలు చాలానే కనిపిస్తున్నాయ్.. మరి, బీజేపీ తోక పార్టీ ఎందుకు అవదు.? అన్నది వైసీపీ వాదన.