దుబ్బాక ఉప ఎన్నికలానే నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కూడా బీజేపీ – టీఆర్ఎస్ మధ్యనే ప్రధాన పోటీ అన్నట్టు జరగబోతోందా.? అంటే, ఔననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సీనియర్ పొలిటీషియన్ జానారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగనున్న విషయం విదితమే. అయితే, జానారెడ్డి ప్రభ గతంలోలా లేదిప్పుడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన ఓటమి చవిచూశారు. తెలంగాణలో పేరుకే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం. కానీ, ఆ పార్టీ పట్ల పార్టీ నాయకుల్లో ఎవరికీ విశ్వాసం లేని పరిస్థితి. జానారెడ్డి సైతం, రాష్ట్ర పార్టీ నాయకత్వం అలాగే జాతీయ నాయకత్వం పట్ల కొంత కాలం పాటు కినుక వహించారు. జానారెడ్డిని తమ వైపుకు తిప్పుకోవడానికి గులాబీ పార్టీతోపాటు, కమలం పార్టీ కూడా ప్రయత్నించాయి.
ఓ దశలో ఆయన అసలు ఉప ఎన్నికలో పోటీ చేయడానికీ విముఖత చూపారు. ఇదిలా వుంటే, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కమలం పార్టీ వైపు అడుగులేస్తున్నారు. తనను బీజేపీ నాయకత్వం పిలుస్తోందనీ, నాగార్జున సాగర్ నుంచి పోటీ చేయమని కోరుతోందనీ, అయితే తానింకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణలో గులాబీ పార్టీని ఎదుర్కొనే సత్తా భారతీయ జనతా పార్టీకే వుందన్నది ఆయన ఉవాచ.
గతంలో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీజేపీలో చేరేందుకు ప్రయత్నించి చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. అయితే, బీజేపీ నుంచి టిక్కెట్ ఆశించే క్రమంలోనే కోమటిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు తప్ప, బీజేపీ నుంచి ఆయనకు ఎలాంటి పిలుపూ లేదని కమలదళంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తమ్మీద, ప్రస్తుతం వున్న సమీకరణాల్ని బట్టి నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో గులాబీ పార్టీ అలాగే కమలం పార్టీ మధ్యనే ‘పోరు’ నడిచే అవకాశం వుందన్నమాట.