భారతీయ జనతా పార్టీ రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతోంది. భవిష్యత్తు మొత్తం మాదే అన్నట్టు మాట్లాడుతోంది. జనసేనతో పొత్తు పెట్టుకుని పైకి రావాలని చూస్తోంది. ఇప్పటికే బలపడిపోయామన్నట్టు చెప్పుకుంటున్నారు కమలనాథులు. ముఖ్యంగా కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు ఎక్కడికి వెళ్లినా ఎదురేలేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఆయనలోని ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని చూస్తే ముచ్చటేస్తుంది కానీ వాటి వెనుక రియాలిటీను తలుచుకుంటేనే జాలేస్తుంది. ఎంతో కాలం నుండి ఏపీలో జెండా ఎగరవేయాలని బీజేపీ చేయని ప్రయత్నం అంటూ లేదు. పొత్తుల మీదనే నడుస్తూ హడావుడి చేస్తూ వస్తున్నారు. అయితే గతం కంటే ఈసారి హడావుడి కాస్త ఎక్కువగా కనిపిస్తోంది. అందుకు కారణం కాస్త బెట్టు, ఇంకాస్త కలుపుగోలుతనమే.
సాధారణంగా బీజేపీకి ఉన్న నలుసంత బలానికి చంద్రబాబు నుండి పొత్తుకు ఆఫర్ వస్తే కాదని అనకూడదు. కానీ ససేమిరా అంటున్నారు. చంద్రబాబు స్థాయి వ్యక్తిని కాదనడంతో వారికి కాస్త బెనిఫిట్ అయింది. ఇక జనసేనతో పొత్తు కూడ కాపు వర్గంలో గుర్తింపును ఇచ్చింది. అయితే అధికారాన్ని అందుకోవడానికి లేదా ప్రతిపక్షంగా నిలబడటానికి ఇవి ఏమాత్రం సరిపోవు. వాటిని చూసుకునే ఉబ్బిపోతే బొక్కబోర్లా పడక తప్పదు. ఉత్తరాంధ్రలో బలపడాలని నానా తంటాలు పడుతూ కుల సమీకరణాలకు తెరతీసిన బీజేపీ బీసీలను ఆకట్టుకోవాలని కిందా మీదా పడుతోంది. బీసీలేమో కొందరు వైసీపీ, ఇంకొందరు టీడీపీ వైపు చీలిపోయి ఉన్నారు. ఆ పార్టీల నుండి వారిని విడదీయడం అంత ఈజీ కాదు. కానీ ఇరువైఫులా ఉన్నారు కాబట్టి ఒకే ప్రత్యామ్నాయంగా కనిపిస్తే ఆదరిస్తారనే ఆశతో ఉంది బీజేపీ. అది జరగాలంటే చాలా ఏళ్ళు పడుతుంది. అసాధ్యం అయితే కాదు.
ఇంతవరకు బాగానే ఉన్నా రాయలసీమలో కూడ వచ్చే ఎన్నికల నాటికి వికసించాలని కమలం పార్టీ అనుకోవడమే అత్యాశలా అనిపిస్తోంది. రాయలసీమ జనానిది ఒకే డైరెక్షన్ అది వైసీపీ. గతంలో సీమ ప్రజలు వైఎస్ ఉండగా కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చినవారు ఈనాడు జగన్ సారథ్యం వహిస్తున్న వైసీపీకి అండగా ఉన్నారు. కొద్దిగా కూడ తేడా లేకుండా సీమలో జగన్ హవానే నడుస్తోంది. దశాబ్దాల చరిత్ర ఉన్న టీడీపీకే సీమలో పాగా వేయడం సాధ్యంకాలేదు. గత ఎన్నికల్లో రెండంటే రెండే అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడు పేరుకు సీమ జిల్లా వ్యక్తే అయినా ఆయన్ను ఆదరించట్లేదు అక్కడివారు. అందుకే ఆయన రాజకీయమంతా ఉత్తరాంధ్రలోనే నడుస్తుంది. అదే ఆయన ఆయువు పట్టు. ఆయన ముఖ్యమంత్రిగా గెలిచిన ప్రతిసారీ ఉత్తరాంధ్ర జనమే ఆదుకున్నారు.
అలా దశాబ్దాల తరబడి ఏకపక్ష తీర్పును ఇస్తున్న సీమలో బీజేపీ పెను మార్పులు తీసుకురావాలని చూస్తోంది. తాజాగా సోము వీర్రాజు కొందరు బీజేపీ లీడర్లను వెంటబెట్టుకుని కర్నూలులో తిరిగారు. సీమలో అన్యాయం జరుగుతోందని, అభివృద్ధి పడకేసిందని, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే సీమ అభివృద్ధి జరుగుతుందన్నారు. మొత్తానికి జగన్ ను బెదరగొట్టేస్తున్నామన్నట్టు కలరింగ్ ఇచ్చారు. కానీ అవన్నీ తాటాకు చప్పుళ్ళే తప్ప జగన్ కంచుకోటను ఏమాత్రం కదిలించలేవని అందరికీ తెలుసు.