త్వరలో నాగార్జున సాగర్ ఉపఎన్నికలు రానున్నాయి. ఈ స్థానంలో గెలుపును కైవసం చేసుకోవడానికి మూడు ప్రధాన పార్టీలు తెరాస, కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా కృషిచేస్తున్నాయి. వాస్తవానికి చూసుకుంటే అక్కడ బలంగా ఉన్నది కాంగ్రెస్, తెరాస పార్టీలే. బీజేపీకి గెలిచేంత సామర్థ్యం లేదన్నది వాస్తవం. కానీ కొన్ని నెలలుగా రాష్ట్రంలో కనిపిస్తున్న అనుకూల పరిస్థితుల ద్వారా గెలుపు సాధించాలని బీజేపీ ట్రై చేస్తోంది. ముందు బలమైన అభ్యర్థిని పట్టుకునే ప్రయత్నంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థిగా సీనియర్ లీడర్ జానారెడ్డిని ఖాయం చేసింది. జానారెడ్డి పోటీలో నిలవడమే తెరాస, బీజేపీలకు చెమటలు పట్టిస్తోంది. జానారెడ్డి పలుమార్లు నాగార్జున సాగర్ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు.పటిష్టమైన క్యాడర్ ఉంది. అలాంటి వ్యక్తిని ఢీకొట్టాలంటే అవతల కూడ బలమైన లీడర్ ఉండాల్సిందే.
సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని తెరాస లెక్కలు మీద లెక్కలు వేసుకుంటోంది. నోముల కుటుంబానికి టికెట్ ఇచ్చే యోచనలో లేరు కేసీఆర్. దుబ్బాకలో కూడ అలాగే చేసి దెబ్బతిన్నారు. అందుకే మరొక నేతను వెతుకుతున్నారు. తెరాస ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి పోటీలోకి దిగడానికి ఉత్సాహంగా ఉన్నారు. కేసీఆర్ అవకాశం ఇస్తే బరిలో నిలుస్తానని అంటున్నారు. గతంలో ఈయన టీడీపీ తరపున పోటీచేసి జానారెడ్డి చేటిలో ఓడిపోయారు. అర్థ బలం, అంగ బలం ఉన్న వ్యక్తి. బీసీలకు కాకుండా టికెట్ పక్కకు వెళితే ఈయనకే ఇస్తారనే టాక్ ఉంది. ఈయన పోటీలో ఉంటే ఫైట్ క్లిష్టంగానే ఉంటుంది. కానీ గెలుపు మీద గ్యారెంటీ లేదు. అందుకే కేసీఆర్ ఆలోచనలో పడ్డారు.
ఇక బీజేపీ విషయానికొస్తే సొంత అభ్యర్థి లేక బయటి పార్టీల్లో నేతలను వెతుక్కుంటోంది. మొదట్లో ఏకంగా జానారెడ్డినే టార్గెట్ చేశారు. ఎన్ని ఆఫర్లు ఇవ్వాలో అన్నీ ఇచ్చేసి పార్టీలోకి లాగాలని చూశారు. కానీ ఆయన మెత్తబడలేదు. దీంతో తెరాస నేత తేరా చిన్నపరెడ్డి మీద గురిపెట్టారు. ఆయనతో మంతనాలు పూర్తైనట్టు, త్వరలో పార్టీలో చేరిపోతారని ప్రచారం జరిగింది. ఒకవేళ కేసీఆర్ చిన్నపరెడ్డికి టికెట్ ఇవ్వని పక్షంలో ఆయన్ను ఏదోలా బుజ్జగించి పార్టీలోకి లాగేయాలని చూస్తోంది బీజేపీ. అదేమంత ఈజీ అయిన పని మాత్రం కాదు. ఆయన కుదరని పక్షంలో టికెట్ ఇవ్వడానికి స్ట్రాంగ్ లీడరే కరువయ్యాడు కాషాయ పార్టీకి.