భారతీయ జనతా పార్టీ నాయకుల సంఖ్యను పెంచుకునే పనిలో ఉంది. ఇప్పటికిప్పుడు కొత్త లీడర్లను తయారుచేసుకోలేరు కాబట్టి రెడీమేడ్ నాయకుల మీద దృష్టి పెట్టింది. ఆల్రెడీ రాజకీయాల్లో పండిపోయివున్న నేతల మీద కన్నేసింది. అది కూడ తెలుగుదేశం పార్టీ లీడర్ల మీదే కావడం విశేషం. 2024 ఎన్నికల నాటికి ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదగడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఒకప్పుడు టీడీపీలో పేరొందిన నాయకులుగా వ్యవహరించి ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురవుతున్న నేతలనే టార్గెట్ చేసుకుని పావులు కదుపుతోంది. ఉత్తరాంధ్రలో టీడీపీకి పట్టున్న జిల్లాల్లో శ్రీకాకుళం ఒకటి. ఇప్పుడంటే వైసీపీ హడవా కనబడుతోంది కానీ తొలి నుండి అక్కడ టీడీపీదే పైచేయి. గత ఎన్నికల్లో కూడ కింజారపు కుటుంబం అక్కడ జెండా ఎగురవేసింది.
రాజకీయాల్లో కింజారపు కుటుంబంతో సమానంగా పేరొందిన కుటుంబమే కిమిడి కుటుంబం. కిమిడి కళా వెంకటరావు నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం అధ్యక్షుడిగా వ్యవహరించారు. మూడున్నర దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న కుటుంభం. 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఈయన సోదరుడు కిమిడి గణపతిరావు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసి ఉన్నారు. అదే కుటుంబానికి చెందిన కిమిడి మృణాళిని కూడ 2014లో చీపురుపల్లి నుండి ఎమ్మెల్యేగా నెగ్గారు. బొత్స సత్యనారాయణ లాంటి లీడర్ మీదనే 20 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆమె కుమారుడు కిమిడి నాగార్జున గత ఎన్నికల్లో రాజకీయ రంగప్రవేశం చేసి గత ఎన్నికల్లో చీపురుపల్లి నుండి పోటీచేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన విజయనగరం పార్లమెంట్ టీడీపీ ప్రెసిడెంట్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
ఇలా పలుమార్లు జిల్లా రాజకీయాల మీద పట్టు సాధిస్తూ వచ్చిన కిమిడి కుటుంబం గత ఎన్నికల్లో మాత్రం డీలా పడింది. కొని పరిస్థితుల కారణంగా టీడీపీ అధ్యక్ష పదవి నుండి కళావెంట్రావును తొలగించి అచ్చెన్నాయుడుకు కట్టబెట్టారు. ఈ పరిణామం అవసరమైనదే అయినా కళా వెంకటరావు కొద్దిగా నొప్పించింది. ఆ తర్వాత నుండి ఆయన పార్టీ కార్యకలాపాల్లో పెద్దగా పాల్గొనలేదు. ఏదో పార్టీలో ఉన్నాం అంటే ఉన్నాం అనేలా ఉన్నారు. అందుకే వారి కుటుంబానికి గాలం వేసింది బీజేపీ. అదే కుటుంబానికి చెందిన రామకృష్ణంనాయుడును పార్టీలోకి లాక్కోవాలని చూస్తున్నారట. ఇప్పటికే ఒక దఫా చర్చలు కూడ ముగిశాయని చెబుతున్నారు.
ఆయనకు వచ్చే ఎన్నికల్లో ఎచ్చెర్లలో టికెట్ ఇచ్చే డీల్ పెట్టుకున్నారట. ఇంకొద్ది రోజుల్లో ఆయన పార్టీ ఖాయమని చెబుతున్నారు. అయితే ఈ పరిణామం వెనుక కళా వెంకటరావు పర్యవేక్షణ ఉండనే టాక్ నడుస్తోంది. ఇక టీడీపీనే పట్టుకుని వేలాడితే లాభంలేదనుకున్న ఆయన తానే స్వయంగా పార్టీ మారితే బాగోదు కాబట్టి కుటుంబ సభ్యుల్లో కొందరిని బీజేపీలోకి పంపి స్థిరపరచాలని,ఒకవేళ బీజేపీ బలపడితే ఆ పార్టీ వైపు నుండి కూడ రాజకీయాల్లో తిప్పవచ్చని భావించి ఉండొచ్చని, ఒకవేళ వచ్చే ఎన్నికల్లో బీజేపీ పుంజుకుని, టీడీపీ మరింత వెనకబడితే ఆయన కూడ జంప్ చేసినా చేయవచ్చని శ్రేణులు జిల్లా వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి.