కష్టాల్లో ఉన్న నానికి వల వేస్తున్న బీజేపీ.. పడితే మాత్రం సంచలనమే !

BJP targets Kesineni Nani

బీజేపీ తెలుగు రాష్ట్రాల మీద గట్టిగానే కసరత్తులు చేస్తోంది.  ప్రాంతీయ పార్టీలను అధిగమించి వేళ్ళూనుకోవాలని చూస్తోంది.  అందుకోసం లోకల్ పార్టీల లీడర్ల మీద గురిపెట్టింది.  ప్రత్యర్థి పార్టీల నుండి నాయకులను  తమలో కలుపుకోవాలని పన్నాగాలు పన్నుతోంది.  ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే వారి తరపున ప్రజాప్రతినిధులు అంటూ ఎవరూ లేరు.  అసలు ఎన్నికల్లో నిలబడి  గెలవగలరన్న ఇమేజ్ ఉన్న నాయకులే లేరు.  అందుకే ముందు టికెట్లు ఇవ్వడానికి నాయకులను సిద్ధం చేసుకుంటున్నారు.  ప్రస్తుతం వీరి టార్గెట్ అంతా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మీదే ఉంది.  టీడీపీలో నాయకులకు భద్రత లేదు.  ఎప్పుడు ఏ కేసు మీద పడుతుందో అనే ఆందోళనలో ఉన్నారు.  

ఈ భయంతోనే సగం మంది నాయకులు యాక్టివ్ పాలిటిక్స్ చెయ్యట్లేదు.  ఎవరి నియోజకవర్గాల్లో వారు సైలెంట్ అయిపోయారు.  ఇంకొందరు ధైర్యం చేసి ఏదో పోరాడుతున్నా అధిష్టానం తీరుతో అసంతృప్తిలో ఉన్నారు.  అలంటి వారిలో ఎంపీ కేశినేని నాని కూడ ఒకరు.  ఎన్నికలు ముగిసిన నాటి నుండి నానికి అభిష్టానానికి పొసగట్లేదు.  బహిరంగంగానే అసమ్మతి వ్యక్తం చేశారు.  కానీ చంద్రబాబు జోక్యంతో కాస్త సర్దుకుని సైలెంట్ అయ్యారు.  మళ్ళీ ఇప్పుడు ఆయనలో వ్యతిరేకత మొదలైన సంకేతాలు కనిపిస్తున్నాయి.  ఇన్నాళ్లు ఆయన సొంత భవనంలో నడిచిన టీడీపీ కార్యాలయాన్ని వేరొక చోటుకి తరలించింది అధిష్టానం.  ఇది నానికి అస్సలు నచ్చలేదట. 

BJP targets Kesineni Nani

ఇటీవల జరిగిన పార్టీ పదవుల పంపకాల్లో కూడ ఆయనకు ఎలాంటి ప్రాధాన్యం  ఇవ్వలేదు.  పైపెచ్చు తాను పూర్తిగా వ్యతిరేకమైన దేవినేని ఉమకు పదవి దక్కింది.  ఇది మరింత నొప్పించిందట ఆయన్ను.  ఇలా వరుసగా పార్టీలో నిర్లక్ష్యానికి గురవుతుండటంతో ఆయన పార్టీ మారాలనే యోచన చేస్తున్నారని అంటున్నారు.  మొదటి నుండి కేశినేని సొంత క్యాడర్ మీదే రాజకీయం నడుపుతూ వచ్చారు.  కాబట్టి ఆయన గెలుపుకు పార్టీలతో పెద్దగా సంబంధం లేదు.  విజయవాడ లోక్ సభ పరిధిలోని ఏడు  స్థానాల్లో టీడీపీ గెలిచింది ఒక్క తూర్పు నియోజకవర్గంలో మాత్రమే.  మిగిలిన అన్ని చోట్లా వైసీపీ జెండానే ఎగిరింది.  అంత వ్యతిరేకతలో కూడ నాని ఎంపీగా గెలిచారంటే ఆయన సొంత బలం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.  

అలాంటి సొంత బలమున్న నాయకుడ్ని పార్టీలోకి లాక్కుంటే విజయవాడలో బలపడవచ్చనేది బీజేపీ ఆశ.  ఇప్పటికే బీజేపీ కేశినేని నాని వరకు సంకేతాలు పంపిందని, అన్ని రకాలుగా ప్రాముఖ్యత ఇస్తామని తెలియజేస్తోందని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.  వారి ప్రయత్నాలే గనుక ఫలించి నాని కాషాయ కండువా కప్పుకుంటే మాత్రం సంచలనమే.