రాజకీయ నాయకులు, పార్టీలు ఏది చేసినా స్వప్రయోజనం లేకుండా చేయరనేది ముమ్మాటికీ నిజం. అందులోనూ బీజేపీ లాంటి పార్టీలైతే అస్సలు పూనుకోవు. తమకు మేలు జరుగుతుంది అంటే రాజ్యాంగ వ్యవస్థలనైనా మేనేజ్ చేయడానికి కూడ వెనుకాడరు వారు. అలాంటి పార్టీ ఏపీలో జనసేనతో పొత్తులో ఉంది అంటే ఎలాంటి లక్ష్యాలను పెట్టుకుని ఉంటుందో ఊహించవచ్చు. గత ఎన్నికలకు ముందు పవన్ బీజేపీని, మోదీని తీవ్రంగా దుయ్యబట్టారు. అయినా సర్దుకుపోయి ఆయన్ను ఢిల్లీకి పిలిపించుకుని మరీ పొత్తును ప్రకటించారు.
కారణం.. బీజేపీకి ఆంధ్రాలో ఒక సెలబ్రిటీ ఫేస్ కావాలి. తమ గొంతుకను జనంలోకి బలంగా తీసుకెళ్ల గలిగిన నాయకుడి కావాలి. అందుకే పవన్‌ను ఎంచుకున్నారు. ఆయన్ను ముందుపెట్టి వ్యవహారం నడుపుదామని అనుకున్నారు. 2024నాటికి కూటమిని బలపరిచి అన్ని జిల్లాలో సామాజిక వర్గాల సమీకరణల రీత్యా బలమైన నాయకులను పార్టీలోకి లాగాలని అనుకున్నారు. ఎలాగూ పవన్‌కు ఒక పెద్ద సామాజిక వర్గం అండగా ఉంది. అది కూడా కలిసి వస్తుందని పిలిచి పొత్తు పెట్టుకున్నారు.
కానీ వారి ప్లాన్ అంతా రివర్స్ అయింది. ఏదో పవన్ పేరును, ఛరీష్మాను గట్టిగా పిండుకుని బలపడిపోదాం అనుకున్నవారికి పవన్‌నే రివర్స్‌లో పిచ్చెక్కిస్తున్నాడు. ఇక్కడ పిచ్చెక్కించడం అంటే తన డిమాండ్లతో, దూకుడుతో, ఆధిపత్యంతో కాదు మౌనంతో. పవన్‌ను రెచ్చగొట్టడం, ఆయన రెచ్చిపోయి ఊగిపోతే తాము ఎలివేట్ కావాలని బీజేపీ పథక రచన చేసింది. కానీ పవన్.. రెచ్చిపోవడం మాట అటుంచితే కనీసం సరిగ్గా మాట్లాడటంలేదు కూడ. అందుకు ఉదాహరణే ఆలయాలపై దాడుల విషయంలో ఆయన స్పందన.
బీజేపీ ఆ వివాదానికి మతం రంగు పులిమి రాజకీయం చేయాలని గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంది. పవన్‌ను ముందు నిలబెట్టి వ్యవహారం నడపాలని భావించింది. కానీ పవన్ ప్రెస్ నోట్లు, చిన్నపాటి వీడియోలో తన ఆలోచనలు చెప్పడం, దీపాలు వెలిగించమనడం మినహా ఏమీ చేయలేదు. ఆయనే అనుకుంటే జనసేన శ్రేణులు సైతం మతపరమైన ఆ వివాదాన్ని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో బీజేపీ ఒంటరిగా అరిచి అరిచి అలసిపోయింది. అలా ఎదో ఉద్ధరిస్తాడనుకున్న పవన్ సరైన టైంలో సైలెంట్ అయిపోవడం బీజేపీని పెద్ద దెబ్బే కొట్టింది.