చంద్రబాబుకి బీజేపీ ‘నో’ చెప్పేసిందా.?

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఢిల్లీకి వెళ్ళారు.. రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతోందనీ, ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని ఆరోపిస్తూ, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలనే డిమాండ్‌తో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ఢిల్లీకి వెళ్ళింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అపాయింట్మెంట్ దొరికింది.. రాష్ట్రపతితో టీడీపీ బృందం సమావేశమయి, రాష్ట్రపతి పాలనను కోరింది కూడా.

అయితే, పలువురు కేంద్ర మంత్రుల్ని చంద్రబాబు బృందం కలవాలనుకున్నా, అటు వైపు నుంచి స్పందన సానుకూలంగా రానట్టే కనిపిస్తోంది. నిజానికి, చంద్రబాబు ఢిల్లీ టూర్ వెనుక రాజకీయ కారణాలు వేరే వున్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు.

బీజేపీతో తిరిగి స్నేహం కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారనీ, ఈ క్రమంలోనే టీడీపీ కార్యాలయంపై దాడి అంశాన్ని సాకుగా చూపి ఢిల్లీకి వెళ్ళిన చంద్రబాబు అండ్ టీమ్, బీజేపీ అగ్ర నేతల్ని కలిసేందుకు విశ్వప్రయత్నాలు చేసినా, అక్కడ చుక్కెదురయ్యిందనీ అంటున్నారు.

ఇందులో నిజమెంత.? అన్న విషయాన్ని పక్కన పెడితే, నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం వున్న చంద్రబాబుకి, ఢిల్లీలో చెప్పుకోదగ్గ నాయకులెవరూ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఆశ్చర్యకరం. ఒకప్పుడు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేశాననీ, దేశ ప్రధాని అయ్యే అవకాశం కూడా తనకు వచ్చిందనీ పలుమార్లు చంద్రబాబు గొప్పలు చెప్పుకున్నారు.

ఏదీ ఎక్కడ.? ఆనాటి చంద్రబాబు ఫాలోయింగ్ ఇప్పుడేమైపోయింది.? చంద్రబాబు బృందం ఢిల్లీకి వెళ్ళింది.. అక్కడ అస్సలు హంగామానే లేకుండా పోయింది. టీడీపీ అధికారంలో వున్నా, లేకున్నా.. ఢిల్లీ లాబీయింగ్ విషయంలో ఆయన దిట్ట. కానీ, అది ఒకప్పుడు. ఇప్పుడు ఆ లాబీయింగ్ కూడా కనిపించడంలేదాయె.