అంతర్వేధిలో జరిగిన రథం దగ్దమైన ఘటన రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. హిందూ దేవాలయాల మీద వరుసగా జరుగుతున్న ఈ ఘటనలు హిందూత్వం మీద జరుగుతున్న దాడులే అంటూ బీజేపీ, జనసేనలు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. ఆ ఆందోళనలో భాగంగానే బీజేపీ, జనసేనలు ఛలో అంతర్వేది కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీజేపీ, జనసేన శ్రేణులు తరలివెళ్లాయి. కానీ పోలీసులు ఎక్కడికక్కడ బీజేపీ, జనసేన నేతలను, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో కార్యక్రమంలో పాల్గొనడానికి బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ విశాఖ నుండి కాకినాడకు బయలుదేరారు. కానీ సాయంత్రం నుండి ఆయన మొబైల్ ఫోన్ స్విఛ్చాఫ్ చేసి ఉంది. ఎవ్వరికీ అందుబాటులో లేరట. కుటుంబ సభ్యులు ఆయన్ను కాంటాక్ట్ చేయాలని ఎంత ట్రై చేసినా ఆయన దొరకలేదట. దీంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు పోలీస్ అరెస్టుల్లో ఆయన్ను ఏదైనా పోలీస్ స్టేషన్లో ఉంచారా అనే అనుమానంతో తూర్పు గోదావరి జిల్లా పోలీసులను పోలీసులు కాంటాక్ట్ చేశారట. కానీ పోలీసులు ఆయన్ను ఆరెస్ట్ చేయలేదని తెలిపారట.
దీంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మరింత పెరిగిపోతోంది. కార్యక్రమానికని బయలుదేరిన ఎమ్మెల్సీ ఏమయ్యారు, ఎక్కడున్నారు అనేది మిస్టరీగా మారింది. మరోవైపు ఏపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.