ఏపీ మంత్రి కొడాలి నాని సంగతి అందరికీ తెలిసిందే కదా. ఆయన ఏది మాట్లాడినా ముక్కుసూటిగా మాట్లాడుతారు. ఆయన కళ్లలో ఏమాత్రం భయం ఉండదు. ఎదుటి వాళ్లు ఎంతటి వాళ్లు అయినా సరే.. వాళ్లకు సరైన సమాధానం చెప్పగల దిట్ట.
ప్రభుత్వం మీద ఈగ వాలనీయరు. వైసీపీ మీద, ప్రభుత్వం మీద ఎవరైనా ఆరోపణలు చేస్తే వాటిని ఇట్టే తిప్పికొట్టేగల సమర్ధుడు. ఇటీవల ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడులను మనం చూస్తూనే ఉన్నాం కదా. వాటి మీద కూడా ఏదో కాజువల్ గా మాట్లాడారు కానీ.. అది పెద్ద సీరియస్ ఇష్యూ అయింది.
హిందూ దేవాలయాల మీద దాడి జరిగితే వైసీపీకి వచ్చే లాభం ఏమన్నా ఉందా? రోడ్డు పక్కన గుడిలో ఉన్న ఆంజనేయస్వామి చేయి విరిగితే గుడికి, ఆంజనేయ స్వామికి వచ్చే నష్టం ఏముంటుంది. దుర్గ గుడిలో వెండి విగ్రహాలు పోయాయి. మా.. అంటే వాటి విలువ నాలుగైదు లక్షలు ఉంటుంది కాబోలు.. ఆ డబ్బుతో మేడలు కట్టుకుంటారా? అలాగే అంతర్వేదిలో రథం దగ్ధం అయినందుకు ప్రభుత్వం కొత్తది చేయిస్తుంది.. దాంట్లో దేవుడికి పోయేది ఏముంటుంది. ఇటువంటి వాటి వల్ల ప్రభుత్వానికి వచ్చే లాభం ఏముంటుంది.. ప్రభుత్వంపై బురద జల్లడానికి బీజేపీకి, టీడీపీకి, జనసేనకు మాత్రం లాభం.. అంటూ పంచులు విసిరారు నాని.
ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ భగ్గుమన్నది. హిందూ దేవాలయాలపై, దేవుళ్లపై ఇలాంటి పిచ్చి వాగుడు వాగుతారా ఎవరైనా? హిందూ సంప్రదాయాలను అవమానిస్తూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను ఏపీ బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందంటూ బీజేపీ ఒక ప్రకటనను విడుదల చేసింది.
కొంతమంది మూర్ఖులకు దేవుళ్ల విగ్రహాలు కేవలం విగ్రహాలుగానే కనిపిస్తాయి.. అది వాళ్ల మూర్ఖత్వం. దాన్న డబ్బుతో వెలకట్టేవాళ్లను ఏం అనలేం. అదే అంతర్వేదిలో చర్చి అద్దాలు పగిలినప్పుడు ఓ వెయ్యి రూపాయలో.. రెండు వేల రూపాయలో ఇస్తే సరిపోయేది కదా.. దానికి 41 మందిపై కేసు ఎందుకు పెట్టారు నాని అంటూ బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.
ఇకనైనా.. కొడాలి నాని హిందూ దేవాలయాలపై, దేవుళ్లపై పిచ్చి వాగుడును ఆపకపోతే హిందువులందరూ కలిసి ఆయనకు తగిన బుద్ధి చెబుతారంటూ బీజేపీ నేతలు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.