ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఒక పని చేయాలి అనుకుంటే చేసి తీరుతారు. ఆ కార్యం పార్టీని నిలబెడుతుంది అని నమ్మితే ఎంత కష్టమైనా వెనుకాడరు. సొంత నిర్ణయాలు తీసుకునే తెగువ లోపించినా ఆ కార్యదక్షత మాత్రం బాబుగారిలో తగ్గలేదు. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీని కలుపుకుని కూటమి కడితే జగన్ కు చెక్ పెట్టొచ్చనేది బాబుగారి ప్రగాఢ విశ్వాసం. అందుకోసం తెగ కష్టపడిపోతున్నారు. మొదట్లో బీజేపీని దువ్వడం సులభమే అనుకున్నారు కానీ ఆ తర్వాత కష్టమని తేలిపోయింది. ఎన్ని విధాలుగా ట్రై చేసినా కమలనాథులు స్పందించడంలేదు. పైపెచ్చు చంద్రబాబుకు తలుపులు మూసేశామని బహిరంగంగానే చెబుతున్నారు. అసలు టీడీపీని తొక్కేసి పైకి రావాలనేదే తమ లక్ష్యమని సోము వీర్రాజు పరోక్షంగా అనేశారు.
అయినా చంద్రబాబు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఆరు నూరైనా బీజేపీని సముదాయించాల్సిందే పాణిగ్రహణం జరగాల్సిందే అంటున్నారు. అందుకే తన రాజ్యసభ సభ్యులు నలుగురిని బీజీపీలోకి పంపడం, బీజేపీకి అనుకూలంగా మాట్లాడటం, వారి నిర్ణయాలను సమర్థించడం, పల్లెత్తి మాట కూడ అనకపోవడం చేశారు, చేస్తూనే ఉన్నారు. కానీ మోదీ, అమిత్ షాల మనసు కరగితే కదా. అందుకే ఢిల్లీ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. వరుసపెట్టి ఆ పార్టీ పెద్దలకు ఫోన్లు చేసి పరామర్శలు చేస్తున్నారు. నిన్న అమిత్ షా పుట్టినరోజు కావడంతో ఆయనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు ఇటీవలే కరోనా నుండి కోలుకున్నారు కదా ఆరోగ్యం ఎలా ఉంది అంటూ పరామర్శ మాటకు మాట్లాడారట.
అలాగే పనిలో పనిగా కిడ్నీలో రాళ్లు ఏర్పడి ఇటీవలే ఆపరేషన్ చేయించుకున్న కేంద్రమంత్రి గోయల్ కు ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీసి సజెషన్స్ ఇచ్చారట. ఇక చిన్నా చితకా నేతలనైతే కొండ జిగురులా పట్టేశారట. మొదట్లో చంద్రబాబు చర్యలకు విసుక్కున్న ఆ బీజేపీ నేతలే పదే పదే పలకరిస్తుండటంతో చేసేది లేక కష్టంగా ఉన్నా రియాక్ట్ అవుతున్నారట. దీంతో బాబుగారికి కొత్త ఉత్సాహం వచ్చేసింది. జిడ్డు రాజకీయం ఫలిస్తున్నందున దాన్నే కంటిన్యూ చేసి అవకాశం చిక్కినప్పుడల్లా లేకపోతే తానే అవకాశాలను సృష్టించుకునో బీజేపీ నేతలను తనవైపుకు తిప్పుకుని తీరాలని, 2024 నాటికి కూటమి కట్టాలని బలంగా ముందుకెళుతున్నారట. చంద్రబాబులోని ఈ పట్టుదల చూసి బీజేపీ నేతలు ఆశ్చర్యపోతుంటే టీడీపీ నేతలు మాత్రం ఈ వెంపర్లాట ఏమిటయ్యా అంటూ సిగ్గుపడుతున్నారు.