అమలాపురంలో హై అలెర్ట్ : బీజేపీ నేతల హౌస్ అరెస్ట్..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అమలాపురంలో పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే..ఇటీవ‌ల హిందూ ఆలయాల ‌పై దాడుల‌ విషయంలో రాష్ట్ర‌ ప్రభుత్వం తీరుకు నిరనగా, ఆంధ్ర‌ బీజేపీ చలో అమలాపురం కార్య‌క్ర‌మాన్ని ఏపీ బీజేపీ అధ్య‌క్షులు సోము వీర్రాజు పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే. దీంతో సోము వీర్రాజు పిలుపుతో అలెర్ట్ అయిన పోలీసులు, ముందుస్తు చ‌ర్య‌ల్లో భాగంగా, ఏపీలో బీజేపీ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేస్తున్నారు.

chalo amalapuram

ఈ నేప‌ధ్యంలో సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణలను నిన్ననే హౌస్ అరెస్ట్ చేయ‌గా.. బీజేపీ నేత విష్ణువర్ణన్ రెడ్డిని అర్థరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే బీజేపీ మహిళా నేత దగ్గుబాటి పురంధేశ్వరిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు, రావెల కిషోర్ బాబును హనుమాన్ జంక్షన్‌లో పోలీసులు అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు తరలిచారు.అమ‌లాపురంలో ఇప్ప‌టికే అద‌న‌పు పోలీసు బ‌ల‌గాల‌ను దించడ‌మే కాకుండా అమ‌లాపురంలో 144 సెక్ష‌న్ విధించారు. దీంతో చలో అమలాపురం కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు తెలిపారు.

ఇక చ‌లో అమ‌లాపురం కార్య‌క్ర‌మంలో భాగంగా అమలాపురం ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించాలని సోము వీర్రాజు పిలుపు ఇవ్వ‌డంతో, ఇప్పటికే అమలాపురానికి కొందరు బీజేపీ నేతలు చేరుకోవడంతో అక్క‌డి పరిస్థిితులు ఉద్రిక్తంగా మారాయి. మ‌రోవైపు అమ‌లాపురంలో ప‌లు షాపుల‌ను వ్యాపారులు స్వ‌చ్ఛందంగా బంద్ చేశారు. అయితే చ‌లో అమ‌లాపురం కార్య‌క్ర‌మానికి అనుమ‌తి లేదంటూ, పోలీసులు చేస్తున్న అక్ర‌మ అరెస్ట్‌ల పై సోము వీర్రాజు మండిప‌డ్డారు. తాము ఈ అక్క‌మ అరెస్టుల‌ను ఖండిస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు.

అంతే కాకుండా జ‌గ‌న్ స‌ర్కార్ ఎన్ని‌ అడ్డంకులు సృష్టించినా, ఛలో అమలాపురం కార్య‌క్ర‌మంలో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ జరిగి తీరుతుంద‌న్నారు సోమువీర్రాజు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచ‌కాల‌ను దేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తామన్నారు. ఇక‌ అంతర్వేదిలో ఇటీవ‌ల జ‌రిగిన‌ ఘటనపై ప్రశ్నించినందుకు, బీజేపీ నేతలపై అక్రమంగా కేసులు పెట్టారని, దీంతో వెంట‌నే ఆ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ.. చలో అమలాపురం కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో బీజేపీ నేత‌లు ఆర్డీవో కార్యాల‌యానికి వెళ్ళ‌కుండా పోలీసులు అడ్డుకోవ‌డంతో, ప్ర‌భుత్వ తీరుకు వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేస్తుండంతో అక్క‌డ టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది.