బీజేపీ కేంద్ర కార్యవర్గంలో పలు మార్పులు చేర్పులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీలో కూడా బీజేపీ నేతల పదవుల్లో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా దగ్గుబాటి పురందేశ్వరిని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తర్వాత పురందేశ్వరి ఏపీ రాజకీయాలపై మరింత ఫోకస్ పెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజధాని అమరావతిలోనే ఉండాలని… వైసీపీకి ప్రజలే బుద్ధి చెబుతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీ రాజధాని విషయంలో బీజేపీ స్పష్టమైన వైఖరితోనే ఉన్నది. ఏపీ రాజధానిగా అమరావతే ఉండాలి. పార్టీ పరంగా అమరావతికే మేం కూడా మద్దతు ఇస్తున్నాం. రైతులకు న్యాయం జరగాలంటే.. వాళ్లు తమ పొలాలను, స్థలాలను ఇచ్చిన ప్రాంతంలోనే అభివృద్ధి జరగాలి. కేంద్రం కూడా ఏపీ రాజధాని అంశంపై స్పష్టత ఇచ్చింది.. అని పురందేశ్వరి అన్నారు.
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వైసీపీ పాలన ఎలా ఉందో చెప్పడానికి ఒక్క ఉదాహరణ చాలు. హైకోర్టు నుంచే ఏపీ ప్రభుత్వానికి ఎన్నో దెబ్బలు తగిలాయి. ఇప్పటి వరకు ఎన్నో కేసుల్లో ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ఎక్కడ చూసినా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలే. ప్రజలే వైసీపీకి సరైన బుద్ధి చెబుతారు. ముఖ్యంగా హిందూ దేవాలయాలై దాడులు ఎక్కువైపోతున్నాయి. ప్రజలు ప్రభుత్వం చేసే పనులన్నింటినీ చూస్తున్నారు.. అంటూ ఆమె వైసీపీ పార్టీపై విరుచుకుపడ్డారు.