తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. దుబ్బాక ఉపఎన్నిక ఫలితాలతో ఓడలు బండ్లయ్యాయి.. బండ్లు ఓడలయ్యాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. బీజేపీ గెలిచింది. దీంతో బీజేపీ నేతలు కూడా అధికార టీఆర్ఎస్ పార్టీపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు చెప్పారని.. వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీదే అధికారం అంటూ కాలర్ ఎగిరేస్తున్నారు.
దీంతో సీఎం కేసీఆర్ కూడా అలర్ట్ అయ్యారు. తర్వాత వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దుబ్బాక ఉపఎన్నిక ఎఫెక్ట్ పడకుండా ఉండేందుకు తానే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రంగంలోకి దిగుతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే.. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు.
సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ రెచ్చిపోయారు. అసదుద్దీన్ ఓవైసీ, సీఎం కేసీఆర్ ఇద్దరూ మాట్లాడుకున్నారు. వాళ్లు ముందే మాట్లాడుకున్న తర్వాత జీహెచ్ఎంసీ కార్యచరణను సీఎం కేసీఆర్ ప్రారంభించారు.. అంటూ ఆయన ఆరోపించారు.
అసదుద్దీన్ ఓవైసీ ఎలా చెబితే అలా సీఎం కేసీఆర్ నడుచుకుంటున్నారని.. అందుకే తెలంగాణలో పరిస్థితులు ఇలా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. ఎంఐఎం ఎమ్మెల్యేపై కేసులు ఉన్నా కూడా వాటిని టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి తమ్మిని బమ్మి చేసి గెలవాలని చూస్తున్నాయంటూ ఆయన ధ్వజమెత్తారు.