ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో ఉన్న మంత్రుల్లో ముఖ్యమైన వ్యక్తి కొడాలి నాని. ఆయనకు వైసీపీలో ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీడీపీ మీద, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆయన విరుచుకుపడుతున్న విధానం చూసిన వారు మొదట్లో ఆశ్చర్యపడేవారు. వైసీపీకి, సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ప్రతి చిన్న విషయంపై కూడా ఆయన స్పందించేవారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో జగ్మోహన్ రెడ్డి న్యాయవ్యవస్థపై యుద్ధం చేస్తున్నప్పటికీ, ఆయన మీద టీడీపీ నాయకులు, రాజకీయ విశ్లేషకులు విమర్శలు చేస్తుప్పటికి కొడాలి నాని మాత్రం మౌనంగా ఉన్నారు. ఈ మౌనానికి కారణం బీజేపీ పెద్దలని తెలుస్తుంది.
బీజేపీపై విమర్శలు చేసిన కొడాలి
అంతర్వేది ఘటన జరిగిన తరువాత బీజేపీ నాయకులు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీపై మంత్రి కొడాలి నాని కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే దుర్గమ్మ రధంలో వెండి సింహాల చోరీ వంటి అంశాలతో పాటు జగన్ తిరుమల పర్యటనలో డిక్లరేషన్ ఇవ్వాలన్న టీడీపీ డిమాండ్ పై కొడాలి నాని ఘాటుగానే స్పందించారు. చంద్రబాబు హయాంలోనే జగన్ అనేక సార్లు తిరుమల వెళ్లారని, అప్పుడు లేని డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకని ప్రశ్నించారు. జగన్ తో పాటు తిరుమల కూడా వెళ్లారు. కులాలను, మతాలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చెయ్యడానికి బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని కొడాలి బీజేపీపై విమర్శలు చేశారు. అలాగే అయోధ్య రామ మందిర భూమి పూజకు మోదీ, యోగిఆదిత్యానాధ్ భార్యలు లేకుండా ఎలా వెళ్లారని ప్రశ్నించిన విషయం కుడా తెలిసిందే.
కొడాలిని మందలించిన బీజేపీ పెద్దలు
బీజేపీపై, బీజేపీ నాయకులపై కొడాలి చేసిన వ్యాఖ్యలు కేంద్ర బీజేపీ పెద్దల వరకు వెళ్లాయని తెలుస్తుంది. ఈ విమర్శలపై రాష్ట్ర బీజేపీ నాయకులను కేంద్ర బీజేపీ నాయకులు వివరణ కోరారని, దీనికి సంబంధించి రాష్ట్ర బీజేపీ నాయకులు ఒక వీడియో క్లిపింగ్ ను కేంద్ర బీజేపీ పెద్దలకు పంపారని తెలుస్తుంది . ఆ వీడియో క్లిపింగ్ చూసిన బీజేపీ నాయకులు ఏకంగా వైసీపీ అధినేత జగన్ ఆదేశాల పంపారని, ఆ ఆదేశాల మేరకే ప్రస్తుతం కోడాలి నాని మౌనంగా ఉన్నారని తెలుస్తుంది. అలాగే రానున్న రోజుల్లో వైసీపీలో ఎలాగో ఎన్డీయేలో చేరబోతుంది కాబట్టి జగన్ కూడా కోడాలిని మౌనంగా ఉండమని చెప్పి ఉంటారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.