భారతీయ జనతా పార్టీ, తిరుపతి ఉప ఎన్నికపై చాలా ఆశలే పెట్టుకుంది. గెలవడానికి కాదు, రెండో స్థానం కోసం. మిత్రపక్షం జనసేన పార్టీతో కలిసి తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో నానా హంగామా చేసింది. నిజానికి, పాపులారిటీ పరంగా చూసుకుంటే, తిరుపతిలో నోటాకి దగ్గరగా వున్న బీజేపీ, ఏకంగా గెలిచేస్తామన్న ధీమాతో హడావిడి చేసిన విషయం విదితమే. మిత్రపక్షం జనసేన పార్టీకి తిరుపతిలో పోటీ చేసే అవకాశమిచ్చి, తెరవెనుక వ్యవహారాలు బీజేపీ చక్కబెట్టి వుంటే, తిరుపతిలో బీజేపీ ఇమేజ్ ఎలా వుండేదో ఏమో. సరే, ఓటర్లు.. తమ తీర్పుని ఈవీఎంలలో భద్రపరిచేశారు. ఫలితం వెల్లడయ్యే రోజున ఎవరి సత్తా ఏంటన్నది తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడుతారు.? అన్న విషయమై ఖచ్చితమైన సమాధానాలు చెప్పేయలేం. అయితే, ప్రస్తుత సమీకరణాల్ని పరిగణనలోకి తీసుకుంటే, అధికార వైసీపీకి తిరుగులేదనే విషయం స్పష్టమవుతంది. రెండో స్థానం టీడీపీకే దక్కేలా వుంది. మరి, బీజేపీ పరిస్థితేంటి.? ఇదైతే ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్నే.
మరోపక్క, తిరుపతి ఉప ఎన్నిక వేళ దొంగ ఓటర్లంటూ బీజేపీ కూడా గట్టిగానే హంగామా చేసింది. తిరుపతి ఉప ఎన్నిక రద్దు చేయాలని కూడా కోరుతోంది. రాష్ట్ర శాఖ ఇంత గట్టిగా నినదిస్తోంది సరే, బీజేపీ జాతీయ నేతలు ఏమంటారు.? జాతీయ నాయకత్వం, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తుందా.? కేంద్రంలో అధికారంలో వున్నది తామే గనుక, చక్రం తిప్పి.. తిరుపతి ఉప ఎన్నికపై కీలక మైన పరిణామం చోటుచేసుకునేలా చేయగలుగుతుందా.? బీజేపీ శ్రేణులతోపాటు, మిత్రపక్షం జనసేన శ్రేణులు అలాగే టీడీపీ, కాంగ్రెస్ శ్రేణులు కూడా బీజేపీ చిత్తశుద్ధి విషయమై భిన్న రకాలుగా వ్యాఖ్యానిస్తున్నాయి. ‘రాష్ట్రంలో మాట్లాడితే సరిపోదు.. కేంద్రంలో అధికారంలో వున్నది మీరే కదా.. చర్యలు తీసుకోండి..’ అని జనసేన నేత ఒకరు, బీజేపీ నేతకి, తిరుపతిలో జరిగిన దొంగ ఓటర్ల వ్యవహారంపై సోషల్ మీడియా ద్వారా సలహా ఇవ్వడం గమనార్హం.