వారెవా… ఓవైపు కరోనాతో ప్రపంచం అతలాకుతలం అయితే.. మన దగ్గర మాత్రం కరోనాను తమ రాజకీయ ప్రయోజనాల కోసం సూపర్ గా వాడుకున్నాయి రాజకీయ పార్టీలు. అంతే కదా మరి.. ప్రజలను బుట్టలో వేసుకోవాలంటే ఏదో ఒకటి చేయాల్సిందే. ప్రస్తుతం కరోనా కాలం. అందుకే.. కరోనాను పట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు.
తెలంగాణలో ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల హడావుడి నడుస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో రాజకీయాలు విపరీతంగా వేడెక్కాయి. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో మునిగి తేలుతున్నాయి.
ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేశాయి. బీజేపీ కూడా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయించినా.. మరోసారి గ్రేటర్ ప్రజలపై వరాల జల్లు కురిపించారు.
తాజాగా.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో కలిసి ఎన్నికల మేనిఫెస్టోను తెలంగాణ బీజేపీ విడుదల చేసింది.
అందులో ఉన్న ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే.. హైదరాబాద్ వాసులను ఉచితంగా కరోనా వాక్సిన్ అందజేస్తారట.
అలాగే… ఉచితంగా మంచినీరు. ఎల్ఆర్ఎస్ రద్దు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద లక్ష ఇళ్లు, మూసీ నది ప్రక్షాళన లాంటి వరాలను గ్రేటర్ ప్రజలకు అందించారు.