BJP : ”ఫ్రంటూ లేదు.. టెంటూ లేదు.. కేసీయార్ చెప్పేదంతా డొల్ల.. అవినీతిపరులంతా ఒక్క చోట చేరుతున్నారు.. జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కొనడం కేసీయార్ మాత్రమే కాదు ఇంకెవరికీ సాధ్యం కాదు.. కేసీయార్ త్వరలో అరెస్టు కాబోతున్నారు. అరెస్టవడం ఖాయమని కేసీయార్ తెలుసుకున్నారు గనుకనే, ముందస్తుగా మద్దతు కూడగట్టుకుంటున్నారు..” అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికలు, నాగార్జున సాగర్, హుజూరాబాద్ ఉప ఎన్నికలు.. ఇలా ఎన్నికలు, ఉప ఎన్నికల సమయంలో బీజేపీ, కేసీయార్ అరెస్టు గురించిన వ్యాఖ్యలు చేస్తూనే వస్తోంది. కానీ, కేసీయార్‌ని అరెస్టు చేసేంత సీన్ కేంద్రానికి వుందా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.
గత కొద్ది రోజులుగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా కలిసొచ్చే రాజకీయ శక్తులతో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మంతనాలు జరుపుతున్నమాట వాస్తవం. నిజానికి, గత కొన్నేళ్ళుగా ఈ ప్రయత్నం జరుగుతున్నా, ఆ ప్రయత్నాలు ఫలించడంలేదు.
వచ్చే ఏడాది చివర్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దానికోసం ఇప్పటినుంచే కేసీయార్ స్కెచ్ వేసుకుంటున్నారు. జమిలి ఎన్నికల పేరుతో కేంద్రం ముందస్తు ఎన్నికలు తెస్తే, జాతీయ స్థాయిలో ఎలా వ్యవహరించాలన్నదానిపైనా కేసీయార్ సమాలోచనలు చేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో కేసీయార్‌ని అరెస్టు చేసేందుకు కేంద్రం సాహసిస్తుందా.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే. పైగా, ‘కేసీయార్ అరెస్టవడం ఖాయం..’ అంటూ హద్దులు దాటి వ్యాఖ్యలు చేస్తోన్న బండి సంజయ్ ఆల్రెడీ అరెస్టయ్యారు, జైలుకెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చారు. తెలంగాణ బీజేపీ ఓవరాక్షన్ తప్ప, బీజేపీ జాతీయ నాయకత్వం, కేసీయార్ విషయంలో అంత సీరియస్‌గా లేదని అనుకోవచ్చా.?