స్వీయ సమాధిని తవ్వుకుంటున్న బీజేపీ

BJP digging its own grave

BJP digging its own grave

దేశంలోని అనేక రాష్ట్రాల్లో బలంగా ఉండి, కొన్ని చోట్ల అధికారంలో ఉండి, కేంద్రంలో పూర్తిస్థాయి మెజారిటీతో రెండు టర్మ్స్ అధికారంలో కొనసాగుతున్న పార్టీ ఏదైనా సరే, తమకు బలం లేదనుకున్న రాష్ట్రాల్లో ఒకింత ఉదారంగా వ్యవహరించి, నిధులు ఇచ్చి, తమ బలాన్ని పెంచుకోవడానికి ప్రయతించడం సర్వ సాధారణం. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, అవినీతిపరులను జైలుకు పంపిస్తామని శుష్క వాగ్దానాలు చేస్తున్న బీజేపీ నాయకత్వం నలభయ్ ఏళ్లుగా ఎన్ని ఊరపిచ్చుక లేహ్యాలు తినిపిస్తున్నా, ఆవగింజంత కూడా బలం పుంజుకోలేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీని స్వహస్తాలతో భూస్థాపితం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే వారిమీద జాలిపడాలా, లేక అసహ్యించుకోవాలో కూడా అర్ధం కావడం లేదు.

పరమ చవటలను, శుంఠలను, బానిసలను పార్టీ సారధులుగా నియమిస్తూ, ఇతర ప్రాంతీయపార్టీల పాదాలక్రింద మట్టి నలుపుతూ, వారు విదిలించే ఎంగిలి మెతుకులను మహాప్రసాదంలా స్వీకరిస్తూ నోరూ వాయి లేని మూగజీవాలుగా మలచి, కట్టుబానిసలను తయారుచేస్తున్న బీజేపీ నాయకత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందివస్తున్న అన్ని అవకాశాలను కావాలనే కాలదన్నుకుంటూ స్వీయపతనానికి రాచబాటలు పరుచుకుంటున్న తీరు చూస్తే ఆశ్చర్యం కలిగించక మానదు. ఒకవంక స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుంటే, ఏమాత్రం ప్రజాదరణ లేని, నిలకడలేని పార్టీ తో పొత్తు పెట్టుకుని సర్వం కోల్పోయే పరిస్థితుల్లో బుద్ధీజ్ఞానం ఉన్న ఏ పార్టీ అయినా ఆంధ్రులు ప్రాణప్రదంగా భావించే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేట్ పరం చేస్తామని ప్రకటిస్తుందా? రాష్ట్రంలో ఎంతోమంది బలిదానాలతో, నిస్వార్ధపరులైన రాజకీయ నాయకుల ఉద్యమాలతో ఏర్పడిన ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటీకరిస్తామని ఎన్నికలు జరుగుతున్న తరుణంలో అలాంటి ప్రకటన తప్పుడు సంకేతాలు ఇస్తుందని రాష్ట్ర బానిసలు ఎవరూ అగ్రనాయకత్వానికి చెప్పే సాహసం చేసి ఉండరు. పార్టీ అధ్యక్షుడైన సోము వీర్రాజుకే మోడీ దర్శనం దొరకదు! మిత్రపక్ష అధినేత పవన్ కళ్యాణ్ ను మోడీ ఇంటి గడప ఛాయలకు కూడా రావడానికి అనుమతి ఇవ్వరు!

మొన్నటి స్థానిక ఎన్నికల్లో సంపూర్ణంగా తుడిచిపెట్టుకుని పోయిన తరువాత కనీసం ఆలోచన ఉన్న నాయకత్వం ఎవరైనా అక్కడ పుంజుకోవడానికి ఉన్న మార్గాలేమిటో అన్వేషిస్తారు. ప్రజాగ్రహాన్ని చల్లార్చడానికి కృషి చేస్తారు. కానీ, మోడీ, షా ల తీరే వేరు. వారికి ఆంధ్రప్రదేశ్ అంటే వెంట్రుకముక్కతో సమానం. ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు..తెలంగాణ అన్నా కూడా బీజేపీ అధినాయకత్వానికి చాలా చులకన. రెండు రాష్ట్రాలకు సున్నం బొట్లు పెట్టడమే తప్ప ఒక్క ప్రాజెక్టును కట్టించడం, రాష్ట్రప్రభుత్వం నిర్మించే ప్రాజెక్టులకు నిధులు అందించడం లాంటి ప్రయోజనకరమైన కార్యం ఒక్కటి కూడా బీజేపీ చెయ్యదు.

ఇక ఆంధ్రప్రదేశ్ లో మరో మూడు వారాల్లో తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక జరగబోతున్నది. అక్కడ జనసేనతో పొత్తు పెట్టుకుని ఆ సీటును గెలుచుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా “ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఇవ్వము” అని పార్లమెంట్ లో ప్రకటన చేస్తారా? అంటే ఏమిటి వారి ధైర్యం? తమకు మెజారిటీ వుంది కాబట్టి ఎవ్వరూ ఏమీ చెయ్యలేరని దురహంకారం కదా? పోనీ అలాంటి ప్రకటన చేయాలనుకున్నప్పుడు కనీసం ఎన్నిక ముగింసేంతవరకైనా వాయిదా వేద్దాం అనే స్పృహ కూడా వారికి లేదంటే ఆంధ్రప్రదేశ్ అంటే లెక్కలేనితనం కాదా?

అదే తిరుపతిలో మోడీ, వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ కు పదేళ్లు ప్రత్యేకహోదా ఇస్తామని సభాముఖంగా వాగ్దానం చేశారు. వారి మాటలు విశ్వసించి రెండు లోక్ సభ సీట్లను, రెండు అసెంబ్లీ సీట్లను ఇచ్చారు ఓటర్లు. ఆ తరువాత మళ్ళీ ఆ ఊసే లేదు. ప్యాకేజీ అంటూ మాట మార్చారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కునిపోయి చంద్రబాబు మోడీకి పాదాక్రాంతుడు కావడంతో హోదా విషయం వెనక్కు వెళ్ళిపోయింది. తన చర్మాన్ని రక్షించుకోవడం కోసం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను బలిపెట్టారు. ఆ తరువాత ఆయన అందుకు తగిన శిక్ష అనుభవించాడు. ఒకసారి చంద్రబాబు మొత్తం సర్వనాశనం చేశాక మళ్ళీ హోదా కావాలని డిమాండ్ చెయ్యడం ప్రస్తుత ప్రభుత్వానికి ఎలా సాధ్యం అవుతుంది?

నిన్న కేంద్రం చేసిన ప్రకటన ద్వారా తెలుగు రాష్ట్రాలంటే బీజేపీకి నిర్లక్ష్యం అని తేలిపోయింది. అంతేకాదు..ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని దక్కించుకోవడం అసాధ్యం అని కూడా మోడీకి అర్ధం అయింది. తెలంగాణాలో కూడా మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోరపరాజయాన్ని చూసాక దుబ్బాకలో విజయం కేవలం వాపు మాత్రమే అని, కేసీఆర్ ఉండగా తెలంగాణాలో కాలు మోపడం దుర్లభం అని బీజేపీ పెద్దలు గ్రహించారు. బలం పెంచుకునే దిశగా ప్రయత్నాలు చెయ్యకుండా, ఆత్మహత్య చేసుకోవడానికే బీజేపీ సిద్ధం అయిందని రుజువైంది.

ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు