తిరుపతి బై పోల్ : పోటీ నుండి తప్పుకున్న జనసేన !

తిరుపతి లోక్ సభ ఉపఎన్నికకు సంబంధించి బీజేపీ, జనసేన పార్టీల మధ్య తాజాగా ఓ క్లారిటీ వచ్చింది. ఎన్నికలో బీజేపీ అభ్యర్థిని నిలిపేందుకు బీజేపీ , జనసేన రెండు కూడా అంగీకరించాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చర్చించి ఎవరు పోటీ చేయాలనేదానిపై ఓ నిర్ణయానికి వచ్చారు. చర్చల అనంతరం తిరుపతిలో బీజేపీ అభ్యర్థిని నిలబెడుతున్నట్టు బీజేపీ నేత మురళీధరన్ ప్రకటించారు. జనసేన మద్దతుతో బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తారని ట్వీట్ చేశారు. పవన్, సోము వీర్రాజు ఇద్దరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఏపీలో తిరుపతి నుంచే బీజేపీ విజయయాత్ర మొదలవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

త్వరలోనే జరగబోయే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోనే తిరుపతి ఉప ఎన్నిక కూడా జరగనుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే టీడీపీ తరపున కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మీ బరిలోకి దిగడం ఖాయం కాగా.. వైసీపీ తరపున గురుమూర్తి పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే బీజేపీ, జనసేన కూటమి తరపున ఎవరు బరిలో ఉంటారనే విషయంపై త్వరలోనే స్పష్టత వస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. మార్చి మొదటి వారంలోనే దీనిపై క్లారిటీ వస్తుందని ఢిల్లీ పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అయితే, తాజాగా తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై బీజేపీ ఓ నిర్ణయానికి వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తమ పార్టీకి చెందిన అభ్యర్థిని జనసేన మద్దతుతో బరిలోకి దింపాలని ఆ పార్టీ భావిస్తోందని సమాచారం.

త్వరలోనే ఇందుకు సంబంధించి అభ్యర్థిని కూడా ప్రకటించబోతున్నట్టు తెలుస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజుతో పాటు పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ సునీల్ దేవధర్ ఇందుకు సంంధించి చర్చలు జరిపారని.. తిరుపతి సీటును బీజేపీకి వదిలేందుకు పవన్ కళ్యాణ్ అంగీకరించారని సమాచారం. అయితే ప్రస్తుతం ఏపీలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆందోళనల నేపథ్యంలో బీజేపీ ప్రజలను మెప్పించి మెరుగైన ఫలితాలు సాధించడం అంత సులువు కాదనే వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్న బీజేపీ ఎంతమేర ప్రజలని ఆకట్టుకుంటుందో చూడాలి.