ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు అత్యంత అధ్వాన్నంగా తయారయ్యాయి. ఎప్పుడూ రాజకీయాలేనా.? ఎప్పుడూ విమర్శలూ వివాదాలేనా.? ఆఖరికి పుట్టినరోజు సందర్భంగా కూడా జుగుప్సాకరమైన వ్యాఖ్యలు, విమర్శలు, కామెంట్లు ప్రముఖుల మీద రావడమంటే అది శోచనీయమే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబుకి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయాల్లో వున్నంత మాత్రాన, రాజకీయ ప్రత్యర్థులైనంతమాత్రాన.. రోజూ తిట్టుకోవాలని లేదు. అసలు తిట్టాల్సిన అవసరమేంటి ఎవరికైనా.? రాజకీయాల్లో సందర్భానుసారం రాజకీయ విమర్శలుంటాయి. అలా చేసుకునే విమర్శలు సద్విమర్శలయి వుండాలి.
కానీ, ప్రస్తుత రాజకీయాల్లో అలాంటివి చూడలేం. చంద్రబాబుకి వైఎస్ జగన్ నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు సోషల్ మీడియా ద్వారా వెళ్ళడం ఇదే కొత్త కాదు. గతంలో చంద్రబాబు కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. కానీ, అటు టీడీపీ పెయిడ్ కార్యకర్తలు.. ఇటు వైసీపీ పెయిడ్ కార్యకర్తలు మాత్రం.. సోషల్ మీడియాని అత్యంత జుగుప్సాకరంగా వాడేస్తున్నారు.. ఆయా నాయకుల మీద. ‘చంద్రబాబు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలను చూసి బుద్ధి తెచ్చుకోండి..’ అంటూ సాధారణ నెటిజన్లు ఇటు టీడీపీ మద్దతుదారులకీ, అటు వైసీపీ మద్దతుదారులకీ సోషల్ మీడియా వేదికగా సూచిస్తున్నారు. ‘అసలు మీరెందుకు ఇంత జుగుప్సాకరమైన వాతావరణంలో బతుకుతున్నారో మీకైనా అర్థమవుతోందా.?’ అంటూ ప్రజాస్వామ్యవాదులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తోంటే, ఆ బురదలో కూరుకుపోయినవారి నుంచి సమాధానమే రాని పరిస్థితి. టీడీపీ, వైసీపీ, జనసేన.. ఇలా ఏ పార్టీ మద్దతుదారులు కూడా ఈ తరహా జుగుప్సాకరమైన కామెంట్లకు అతీతమేమీ కాదు. తమ నేతల్ని చూసి అయినా, ఆయా పార్టీల మద్దతుదారులు, కింది స్థాయి నేతలు బుద్ధి తెచ్చుకుంటే మంచిదేమో.