బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంచలన హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా కోరుతున్న రాష్ట్రాలకు తాము అధికారంలోకి వస్తే ఇచ్చేస్తామని ప్రకటించేశారాయన. అసలు దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా లేదని కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు చెబుతోన్న సంగతి తెలిసిందే.
ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజనతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లభించాల్సి వుంది. అయితే, ఆ హామీని తుంగలో తొక్కారు ప్రధాని నరేంద్ర మోడీ. ‘మేం అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తాం..’ అని ప్రకటించిన బీజేపీ మాట తప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజనతో ప్రత్యేక హోదా రావాల్సి వుండగా, బీహార్ సహా పలు రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోరుతున్నాయి.
బీజేపీ కూడా అవసరార్థం కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా జపం చేస్తున్న సంగతి తెలిసిందే. అన్నట్టు, బీహార్ సీఎం నితీష్ కుమార్ గతంలో బీజేపీతో అంటకాగారు. అప్పట్లో బీహార్‌కి ప్రత్యేక హోదా విషయమై నితీష్ కుమార్ పెదవి విప్పలేకపోయారు.
దేశంలో కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం దిశగా నితీష్ కుమార్ కూడా పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో ‘కేంద్రంలో అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రాలన్నిటికీ ప్రత్యేక హోదా..’ అని ప్రకటించేశారు నితీష్ కుమార్. దేశ రాజకీయాల్లో నితీష్ కుమార్ ఒకింత క్లీన్ ఇమేజ్ పొంది వున్నారు.
అయినాగానీ, దేశంలో ఆయా రాష్ట్రాలకు ప్రత్యేక హోదా సాధ్యమేనా.? అసలు నితీష్ కుమార్ ప్రధాని పీఠమెక్కే అవకాశముందా.? అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్సే. ఒక్కటి మాత్రం నిజం.. ప్రత్యేక హోదాకి పాతరేశామని ఘనంగా చెప్పుకుంటోంది బీజేపీ. ప్రత్యేక హోదా అనేది రాజకీయ నిర్ణయమనీ, దాన్ని పాతరేయడం సాధ్యం కాదని నితీష్ కుమార్ వ్యాఖ్యలతో నిరూపితమయ్యింది.