Akhanda Tickets : బిగ్ ట్విస్ట్: ‘అఖండ’ లెక్కలు వైసీపీ వద్ద వున్నాయట.!

Akhanda Tickets :నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ సినిమా మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. 100 కోట్ల క్లబ్‌లో ఈ సినిమా చేరిందంటూ చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటోంది. బాలకృష్ణ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా ‘అఖండ’ ఇప్పటికే రికార్డులకెక్కింది.

అయితే, ‘అఖండ’ సినిమా విషయమై తాజాగా రాజకీయ రచ్చ మొదలైంది. నందమూరి బాలకృష్ణ, బెజవాడ దుర్గమ్మను సందర్శించుకుని, సినిమా టిక్కెట్ల ధరల వ్యవహారంపై మాట్లాడారు. బాలయ్య వ్యాఖ్యల్లో పెద్దగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమీ లేదుగానీ.. వైసీపీ నేత మల్లాది విష్ణు మాత్రం, బాలయ్య మీద సెటైర్లేశారు.

‘అఖండ’ సినిమాని చూసీ చూడనట్టు వదిలేశామనీ, ఎక్కడ ఏయే చోట్ల టిక్కెట్లను ఎలా పెంచుకున్నదీ, ఎంతెంత వసూళ్ళు చేసిందీ తమకు తెలుసనీ మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. సినీ పరిశ్రమ పట్ల వైసీపీ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందన్న విమర్శల్లో నిజం లేదన్నారు మల్లాది విష్ణు.

కాగా, ‘అఖండ’ సినిమాకి బెనిఫిట్ షోలు వెయ్యకుండా వైసీపీ సర్కార్ చర్యలు తీసుకుంది. కొన్ని చోట్ల ప్రభుత్వ హెచ్చరికల్ని బేఖాతరు చేస్తూ బెనిఫిట్ షోలు పడ్డాయి. అలాంటి థియేటర్లపై జగన్ సర్కార్ చర్యలు కూడా తీసుకుంది.

అయితే, ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే చాలా ఎక్కువగా చాలా చోట్ల ‘అఖండ’ సినిమా టిక్కెట్లను అమ్మేసి, సొమ్ము చేసుకున్నారు. అలా జరిగిన చోట్ల అధికారులెందుకు చూసీ చూడనట్టు వ్యవహరించారన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.

ఇదే తీరు, ఇదే చూసీ చూడనట్టు వ్యవహరించే వైఖరి, ‘భీమ్లానాయక్’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాల విషయాల్లో వుంటుందా.? అన్న ప్రశ్న తెరపైకొస్తోంది. కానీ, టిక్కెట్ల ధరలపై ప్రభుత్వ జీవోని నిన్న హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. దాన్ని డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.