పరిషత్ ఎన్నికలపై ఎస్ఈసీకి షాకిచ్చిన హైకోర్టు: ఆగిన ఎన్నికలు

Big Shock To SEC, Parisht Poll Stalled by HC

Big Shock To SEC, Parisht Poll Stalled by HC

పరిషత్ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని పాటించలేదంటూ విపక్షాలు కోర్టును ఆశ్రయించిన దరిమిలా, ఆ వాదనలతో ఉన్నత న్యాయస్థానం ఏకీభవించినట్లు తెలుస్తోంది. నాలుగు వారాల ఎన్నికల కోడ్ అంశాన్ని పట్టించుకోకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ, ఏప్రిల్ 1న పరిషత్ ఎన్నికల ప్రక్రియను పునఃప్రారంభించడం వివాదాస్పదమయిన విషయం విదితమే. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ తీరుని నిరసిస్తూ, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పరిషత్ ఎన్నికల్ని బహిష్కరించింది కూడా. మరోపక్క, గతంలో జరిగిన ఏకగ్రీవాల్ని రద్దు చేసి, మొత్తంగా ప్రక్రియను పునఃప్రారంభించాలని విపక్షాలు కోరినప్పటికీ, అది సాధ్యం కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. పరిషత్ ఎన్నికల విషయమై అఫిడవిట్ దాఖలు చేయాల్సింది రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కి సూచించింది హైకోర్టు.

ఈ నెల 15న రాష్ట్ర ఎన్నికల కమిషన్ అఫిడవిట్ దాఖలు చేయాల్సి వుంది. ఇదిలా వుంటే, పరిషత్ ఎన్నికల జోరు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకూ కనిపించింది. హైకోర్టు ఆదేశాలతో అభ్యర్థులు ఉస్సూరుమనాల్సిన పరిస్థితి. గతంలో ఓ సారి ఖర్చు చేసి.. ఇప్పుడు ఇంకోసారి ఖర్చు చేసి.. మళ్ళీ పరిషత్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో ఎదురుచూడాల్సి రావడమంటే, అభ్యర్థులకు అంతకన్నా కఠిన పరీక్ష ఇంకోటుండదు. కరోనా కారణంగా పరిషత్ ఎన్నికలు వాయిదా పడగా, కొందరు అభ్యర్థులు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.. మరికొందరు ఇతరత్రా కారణాలతో చనిపోయారు. ఇంకోపక్క అధికార పార్టీ అరాచకాల కారణంగా బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయన్న వాదనలూ లేకపోలేదు. ఈ ఏడాది కాలంలో చాలామంది అభ్యర్థులు పార్టీలు మారిన దరిమిలా, పరిషత్ ఎన్నికలు ఏడాది క్రితం నాటి నోటిఫికేషన్ ద్వారానే జరిగితే ఆ ఎన్నికల ప్రక్రియ పట్ల ప్రజలకు గౌరవమెలా వుంటుంది.? దాన్ని ప్రజాస్వామ్యమని ఎలా అనగలమని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఏదిఏమైనా, కొత్త ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీకి, ఆ పదవిలో తొలి ఎదురు దెబ్బతగా తాజా పరిణామాల్ని చూడాల్సి వస్తుందేమో.