క్షమాపణ ఎందుకు చెప్పాల్సి వచ్చింది.? ప్రధాని మోడీ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందే.!

ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల రైతులకు క్షమాపణ చెప్పారు. అంతలా ఆయన క్షమాపణ రైతులకి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మోడీ ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రైతులు వ్యతిరేకించి, ఉద్యమించిన దరిమిలా, ఈ ఉద్యమంలో 750 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు గనుక.

అయితే, కేవలం రైతులు చనిపోయారు గనుక ప్రధాని మోడీ క్షమాపణ చెప్పారా.? లేదంటే, అంతకన్నా బలమైన కారణం ఇంకేదైనా వుందా.? ఒక్కటి కాదు, చాలా కారణాలున్నాయి.. అందులో రైతులు చనిపోవడం కూడా ఓ ముఖ్యమైన కారణమే కావొచ్చు మోడీ క్షమాపణ చెప్పడానికి.

చట్ట సభలో తమకు బలం వుందని ఏ రూలింగ్ పార్టీ ఇలాంటి చట్టాల్ని తీసుకొచ్చినా, ఆయా ప్రభుత్వాలకు ఇదే గతి పడుతుంది. ఇందులో ఇంకో మాటకు ఆస్కారమే లేదు. మనది ప్రజాస్వామ్యభారతం. ఆ ప్రజాస్వామ్య విలువలకు భిన్నంగా పాలకులు, తమకు నచ్చిన విధానాల్ని అనుసరిస్తామంటే కుదరద.

నిజానికి, వ్యవసాయ చట్టాలపై బీజేపీలోనే చాలామంది అసహనంతో వున్నారు. కానీ, ప్రధాని మోడీ నిర్ణయాలకు ఎదురు చెప్పే ధైర్యం ఎవరికీ లేకుండా పోయింది. ఈ ఘటనతో ప్రధాని నరేంద్ర మోడీ ఆత్మవిమర్శ చేసుకోవాలి. చట్ట సభల్ని తమ ప్రభుత్వం ఎలా నిర్వహిస్తున్నదీ తమను తాము ప్రశ్నించుకోవాలి.

రైతుల సమస్యతో కథ ముగిసిపోయిందని అనుకోవడానికి వీల్లేదు. పెట్రో ధరల విషయమైనా, ఇంకో విషయమైనా.. మోడీ సర్కార్, దేశ ప్రజల ఆలోచనల్ని పరిగణనలోకి తీసుకోవాలి. దేశంలో వివిధ పక్షాలు ఏమనుకుంటున్నాయో ఆరా తీయాలి. లేదంటే, పూటకో క్షమాపణ ప్రధాని నరేంద్ర మోడీ ముందు ముందు చెప్పాల్సి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

దేశాన్ని అప్పుల కుప్పగా మార్చేసి.. అది చాలదన్నట్టు, ప్రభుత్వ సంస్థల్ని (స్టీలు ప్లాంటు వంటివాటిని) విక్రయించేస్తూ.. దేశ ప్రజల్ని ఉద్ధరించేస్తున్నామని మోడీ అండ్ టీమ్ ఇంకా బుకాయించాలనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.?