Bhuvaneswari : వైసీపీపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన భువనేశ్వరి.. కానీ, ఎందుకు.?

Bhuvaneswari : అధికార వైఎస్సార్సీపీ మీద టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు.. అదీ పరోక్షంగా. ‘నా మీద కొందరు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వాటిని నేను అస్సలు పట్టించుకోను. వారి పాపాన వాళ్ళే పోతారు.. రాజకీయంగా పోరాడండి.. వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడకండి.. అభ్యంతరకర రీతిలో వ్యవహరించడం వల్ల ఎవరికీ ప్రయోజనం వుండదు..’ అంటూ భువనేశ్వరి వ్యాఖ్యానించారు.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు, ఆ కారణంగా వచ్చిన వరదల నేపథ్యంలో పలువురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ బాధిత కుటుంబాల్ని ఆర్థికంగా ఆదుకునేందుకు హెరిటేజ్ సంస్థ తరఫున ముందుకొచ్చారు నారా భువనేశ్వరి. ఆయా కుటుంబాలకు తగిన ఆర్థిక సహాయం అందించారు.

ఈ క్రమంలో మీడియా, నారా భువనేశ్వరిని కొన్నాళ్ళ క్రితం వైసీపీ చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా కోరడంతో, ఆమె పై విధంగా స్పందించారు. ‘ఎవరి పాపాన వారే పోతారు..’ అంటూ భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు, ‘వారి క్షమాపణల్ని నేను అంగీకరించను..’ అని ఆమె తేల్చి చెప్పిన వైనం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశాలుగా మారాయి.

‘మేమెవరం నారా భువనేశ్వరి మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదు..’ అంటూ వైసీపీ నేతలు చెప్పుకుంటున్నా, అసెంబ్లీ సాక్షిగా నారా భువనేశ్వరి పేరు ప్రస్తావిస్తూ, కొందరు వైసీపీ శాసనసభ్యులు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మాట వాస్తవం. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు, మీడియా ముందుకొచ్చి కంటతడిపెట్టారు కూడా.

కాగా, భువనేశ్వరిపై తాను చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నట్లు వైసీపీలోకి దూకేసిన టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఓ న్యూస్ ఛానల్ చర్చా కార్యక్రమం సాక్షిగా క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.