బంధుగణం, అనుచరగణం దూరమవడంతో ఒంటరైన భూమా అఖిలప్రియ

రోజు రోజుకు ఏపీలోనే కాదు కర్నూలు జిల్లాలో భూమా కుటుంబం రాజకీయంగా ఒంటరైపోతోంది. మాజీ మంత్రి అఖిలప్రియకు రాజకీయాల్లో తగిన అనుభవం లేకపోవడంతో అటు కుటుంబం ఇటు అనుచరగణం ఆమెకు దూరమైపోతున్నారు. మొదటి నుంచి భూమా కుటుంబానికి ప్రత్యేకవర్గం ఉంది. భూమా, ఎస్వీ కుటుంబాలు పరస్పర సహకారంతో ఇక్కడి రాజకీయాలను చాలా ఏళ్లు శాసించాయి. ఇలా బంధుగణం, అనుచరగణం తో ఢోకా లేకుండా సాగిపోయాయి రాజకీయాలు.

అయితే ఇప్పుడు భూమా అఖిలప్రియ తల్లిదండ్రులు లేకపోవడంతో ఒంటరైపోయిన అఖిలప్రియ అందర్ని కలుపుకొని వెళ్లలేకపోతోందని సమాచారం. సమీప బంధువైన ఏవీ సుబ్బారెడ్డితో కూడా అఖిలప్రియకు విభేదాలొచ్చాయని సమాచారం. నంద్యాల ఉపఎన్నిక సమయంలోనే అవి బయటపడ్డాయి. ఇలాంటి సమయంలో భూమా నాగిరెడ్డి సోదరుని కుమారుడు భూమా కిశోర్‌రెడ్డి బీజేపీలో చేరడంతో కుటుంబంలో చీలిక వచ్చింది. విభేదాలు పెరిగిపోవడంతో కుటుంబ సభ్యులే ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే దుస్థితి వచ్చింది. ఈ కేసులు, గొడవల కారణంగా క్యాడర్ ముందు చులకన అయిపోయారు భూమా అఖిల ప్రియ. అఖిలప్రియ భర్త భార్గవ్‌ తీరు వల్లే ఆ కుటుంబానికి అందరూ దూరం అవుతున్నారని మరో టాక్.

ఇటు అనుచరులు అంటీముట్టనట్టు ఉండడం అటు బంధుగణం దూరం అవడంతో జిల్లాలో భూమా ఫ్యామిలీ రాజకీయంగా ఉనికి కోల్పోతాయే పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు అఖిల ప్రియ రాజకీయ ఎత్తుగడలు కూడా వివాదాస్పదం అవుతుండడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఆమెను దూరం పెట్టారు. ఇలా అందరికీ దూరమై రాజకీయంగా బలహీనమవుతున్నారు భూమా అఖిల ప్రియ.