ఏపీ పంచాయతీ పోరు … ఏ జిల్లాలో ఎన్నంటే, ఆ జిల్లాలోనే అధికంగా ఏకగ్రీవాలు!

ఆంధ్రప్రదేశ్ లో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం పూర్తయింది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడతలో 3,249 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్లు రాగా, సర్పంచ్ పదవికి 19,491, వార్డు సభ్యుల కోసం 79,799 నామినేషన్లు దాఖలయ్యాయి.

పంచాయతీ ఎన్నికలు

వీటిల్లో 523 సర్పంచ్ పదవులకు ఒకే ఒక్క నామినేషన్ చొప్పున దాఖలు కాగా, అవన్నీ ఏకగ్రీవం అయినట్టే. సర్పంచ్ పదవులకు సంబంధించిన నామినేషన్లలో 1,323 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని పేర్కొన్నారు. ఇక తొలి విడతలో ఎన్నికలు జరిగే 12 జిల్లాలను పరిశీలిస్తే, చిత్తూరులో అత్యధికంగా 110 సర్పంచ్ పదవులు ఏగ్రీవమయ్యాయి. ఇదే సమయంలో ఆ జిల్లాలో వార్డుల విషయంలో 2,499 వార్డులకు ఒకే నామినేషన్ చొప్పున దాఖలైంది. అనంతపురం జిల్లాలో అత్యల్పంగా ఆరు పదవులే ఏకగ్రీవం అయ్యాయి. ఇక ఏకగ్రీవం కాని పంచాయతీలు, వార్డులకు 9వ తేదీన పోలింగ్ జరిపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

జిల్లాల వారీగా ఏకగ్రీవాలు చూస్తే.. శ్రీకాకుళంలో 321 పంచాయితీలకు 39 ఏకగ్రీవమయ్యాయి. ఇక విశాఖలో 38 తూర్పు గోదావరిలో 38 పశ్చిమ గోదావరిలో 40 కృష్ణా జిల్లాలో 20 గుంటూరులో 67 ప్రకాశంలో 28 నెల్లూరులో 14 చిత్తూరులో 96 కర్నూలులో 54 కడపలో 46 అనంతపురంలో 6 పంచాయితీలు ఏకగ్రీమైనట్టు ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. ఈ పంచాయతీ ఎన్నికల్లో భారీ ఎత్తున ఏకగ్రీవాలు చేయాలని జగన్ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఏకగ్రీవం అయ్యే పంచాయతీలకు రూ.5లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఆఫర్లు ప్రకటించింది. అయితే అప్పటికే పంచాయతీ రాజ్ చట్టంలో ఉన్న ఈ నజరానాల గురించి పంచాయతీల్లో ముందుగానే అవగాహన ఉండడం.. దీనివల్ల కలిగే ప్రయోజనాలతో చాలా చోట్ల పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన చోట అభ్యర్థలు నామినేషన్లకే మొగ్గు చూపారు.