అరె మామ.. రాత్రి పార్టీ ఉందిరా.. వచ్చేయ్.. అని అనగానే ఆ పార్టీలో ఏముంటాయి చెప్పండి. మద్యం ప్రియులకు ఎక్కువగా ఇష్టమైన బీరు లేని పార్టీ ఉండదు. పార్టీ అంటేనే బీర్.. బీర్ అంటేనే పార్టీ. చిన్న నుంచి పెద్ద వరకు అందరూ లొట్టలేసుకొని తాగుతారు బీర్ ను. అందుకే బీర్ కు అంత డిమాండ్. బీర్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతుండటంతో వాటి ధరలు కూడా ఆకాశాన్ని అంటుకున్నాయి.
అయితే ఇదంతా ఒకప్పుడు. అంటే కరోనాకి ముందు. కరోనా మహమ్మారి వచ్చాక బీర్లు తాగాలంటేనే జనాలు దడుసుకుంటున్నారట. బీర్లను పక్కన పెట్టిన మద్యం ప్రియులు.. ఏకంగా హార్డ్ నే లాగించేస్తున్నారట. కరోనా వచ్చినప్పటి నుంచి మద్యం ప్రియులు ఎక్కువగా విస్కీని సేవిస్తున్నారట. రమ్ సేల్స్ కూడా బాగానే పెరిగాయట.
బీర్ల సేల్స్ పడిపోవడానికి కారణం అది చల్లగా ఉండటమే. అవును.. బీర్లు చల్లగా లేకపోతే తాగలేం. ఆ చల్లదనమే ఇప్పుడు కొంపముంచేస్తుంది. గత రెండు నెలల నుంచి దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా బీర్ల అమ్మకాలు ఒక్కసారిగా పడిపోయాయట.
అసలే కరోనా కాలం. ఈ చల్లటి బీరు తాగితే.. జలుబు చేయడం లేక దగ్గు లాంటివి వస్తే ఇంకేమన్నా ఉందా? అందులోనూ వర్షాకాలం. ఎందుకు గొడవ అని గత రెండు నెలల నుంచి దేశ వ్యాప్తంగా అందరూ బీర్లను తగ్గించి.. విస్కీని ఎక్కువగా లాగించేస్తున్నారట.
అయితే.. సాధారణంగా ఎండాకాలంలో బీర్లకు విపరీతంగా గిరాకి ఉంటుంది. ఈ సంవత్సరం కూడా ఎండలు బాగానే మండాయి. అయితే ఎండాకాలంలో కొన్ని రోజులు లాక్ డౌన్ విధించడం.. మద్యం దుకాణాలు బంద్ కావడంతో ఎండాకాలం కూడా అంతగా బీర్ల అమ్మకాలు సాగలేదట.
ఓవైపు కరోనా భయం.. మరోవైపు బీర్ల రేట్లు ఆకాశాన్ని అంటడంతో దేశ వ్యాప్తంగా బీర్ల సేల్స్ ను 10 నుంచి 20 శాతం తగ్గాయట. బీర్ల అమ్మకాలు అయితే తగ్గాయి కానీ.. బీర్ల ఆదాయం మాత్రం తగ్గలేదు. ఎందుకంటే.. బీర్ల ధరలు పెరగడం వల్ల ఆదాయం కూడా పెరిగింది.