రెండు తెలుగురాష్ట్రాల్లో రాజకీయంగా స్థిరపడటానికి బీజేపీ ఎంతలా ప్రయత్నిస్తుందో అందరికి తెలుసు. అయితే మొదట నుండి కూడా ఏపీ ప్రజలను బీజేపీ నాయకులు మోసం చేస్తూనే వస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, ఎన్నికల్లో గెలిచిన తరువాత మాట మార్చి స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పి ప్రజలను నిరాశపరిచారు. ఇప్పటికి ఏపీ ప్రజలు ప్రత్యేక హోదా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఏపీకి ఎలాగైనా ప్రత్యేక హోదా తెస్తానని చెప్పే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో నినాదంగా పెట్టుకొని అధికారంలోకి వచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం బీజేపీ దోస్తీ చేస్తూ ప్రత్యేకహోదాను పక్కన పెట్టారు.
పోలవరం విషయంలోనూ బీజేపీని విమర్శించని జగన్
ఏ బిల్లులకైనా బీజేపీ ప్రభుత్వానికి మద్దతిచ్చినా జగన్ ను పెద్దగా పట్టించుకోరు. కానీ రాష్ట్ర అంశాలకు సంబంధించి మాత్రం రాజీ పడితే మాత్రం ఖచ్చితంగా జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం పోలవరం నిధుల విషయంలో చేస్తున్న విన్యాసాలను జగన్ అడ్డుకోలేకపోతున్నారంటున్నారు. కనీసం కేంద్రాన్ని ప్రశ్నించే పరిస్థితి కూడా లేదు. దీనికి తెలుగుదేశం పార్టీ జగన్ కేసులను ముడిపెడుతూ ఆరోపణలు చేస్తుంది. ఇలాంటి కీలక విషయాల్లో కూడా జగన్ సైలెంట్ గా ఉండటం వల్ల ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల అసంతృప్తి కనపరుస్తున్నారు.
రాజకీయ ఇబ్బందులు తప్పవు
జగన్ మోడీకి ఎలాంటి బిల్లుల విషయంలో మద్దతు ఇచ్చినా, లేకపోతే కేంద్రంతో మంచి సంబంధాలు మెయింటైన్ చేసినా పట్టించుకోరు కానీ రాష్ట్రా ప్రయోజనాల విషయంలో రాజీ పడితే మాత్రం ఎవ్వరు సహించారు. ఇప్పటికే కావాలని వైసీపీ ప్రభుత్వం బీజేపీ దగ్గర ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం లేదని స్పష్టమవుతోంది. అలాగే పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కూడా బీజేపీ కావాలని ఇబ్బందులు పెడుతున్నా కూడా వైసీపీ పట్టించుకోవడం లేదు. ఇదే పరిస్థితి వచ్చే ఎన్నికల వరకు కొనసాగితే మాత్రం వైసీపీని ప్రజలు తృణీకరించడం ఖాయం.