సెకండ్ వేవ్ తో నిర్లక్ష్యం తగదు..! ఈ లక్షణాలుంటే జాగ్రత్త పడాల్సిందే..!!

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. రోజుకి 2లక్షల 50వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. రెండు వ్యాక్సిన్లు తీసుకొచ్చాం.. మనకేం భయం అనుకున్నాం. నిర్లక్ష్యం చూపాం. ఫలితం.. కరోనా సెకండ్ వేవ్ రూపంలో మహోగ్రరూపమై విరుచుకుపడుతోంది. గతేడాది వైరస్ ను కొన్ని లక్షణాల ద్వారా గుర్తించే అవకాశం ఉండేది. శరీరంలోకి వివిధ రూపాలుగా చేరుతోంది. మొదటి వేవ్‌లో ఇంట్లో ఒక్కరికి సోకితే.. మిగిలినవారు జాగ్రత్తలు పాటించేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఏ చిన్న లక్షణం కనిపించినా ఇంట్లో సైతం మాస్క్ పెట్టుకోవాలి.. దూరంగానే ఉండాలి.

ఫస్ట్ వేవ్‌లో.. ఒళ్లు నొప్పులు, రుచి-వాసన లేకపోవడం, గొంతు మంట, చలి జ్వరం, శ్వాస సమస్యలు ఉండేవి. సెకండ్ వేవ్‌లో.. తలనొప్పి, కళ్లు ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారడం, కళ్ల నుంచి నీళ్లు కారడం కూడా లక్షణాలని వైద్యులు అంటున్నారు. దగ్గు, జ్వరంకు బదులుగా గాస్ట్రో ఇంటస్టినల్ సమస్యలు, నోరు పొడిబారడం, చిగుళ్ల సమస్య, జీర్ణ సమస్య, డయేరియా, ఆకలి లేకపోవడం, నీళ్ల విరేచనాలు కూడా అనుమానించాల్సిన విషయాలని వైద్యులు చెప్తున్నారు. ప్రయాణాలు ఎక్కువగా చేసినా, జనం మధ్య ఎక్కువ సేపు పని చేసినా.. కరోనా సోకిన వారి మధ్య ఉన్నా.. ఎదుటివారిలో లక్షణాలు కనిపిస్తున్నా జాగ్రత్తపడాలి.. పరీక్షలు చేయించుకోవాలి. సీటీ స్కాన్ పై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.. వైద్యుల సలహా మేరకు నడుచుకోవడం ఉత్తమం.

కోవిడ్ బాధితులతో 15 నిమిషాలు కలిసినా, మాట్లాడినా వైరస్ సోకే అవకాశాలున్నాయి. దీంతో వెంటనే ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు చేయించుకోవాలి. డాక్టర్ల సూచనలు తప్పనిసరిగా పాటించాలి. కరోనాను ముందుగా గుర్తిస్తే హోం క్వారంటైన్‌లో ఉంటూ వైద్యులు సూచించే మందులు తీసుకోవచ్చని వైద్యులు అంటున్నారు. నీరసం, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, తుమ్ములు, వాంతులు, ముక్కు కారడం, కండరాల నొప్పి, విరేచనాలు, కడుపు నొప్పి ఉంటే ఇంట్లోనే చికిత్స పొందవచ్చు. ఊపిరితీత్తుల సమస్య తీవ్రమైతే ఐసీయూలో ఉంచి రక్తంలోని ఆక్సిజన్ శాతం 94 కంటే తక్కువగా ఉంటే ఆక్సిజన్ అందిస్తారు.

నిర్లక్ష్యం చేస్తే కిడ్నీ ఫెయిల్యూర్, గుండె సమస్యలు, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ వస్తాయి. దీనివల్ల వైరస్ బాధితుడు చనిపోయే ప్రమాదం ఉంది. రెండో వేవ్ తీవ్రత వల్ల ప్రత్యేక గదిలో ఉండి వైద్యం తీసుకోవాలి. ఇతరులకు వ్యాపించకుండా జాగ్రత్తపడాలి. మాస్క్, సానిటైజర్, ఫేస్‌షీల్డ్ ధరించి వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు. ఇతరుల నుంచి వైరస్ సోకకుండా జాగ్రత్తపడొచ్చు. వైరస్ వచ్చిందని నిరూపణైతే ఆందోళన చెందకూడదు. దానివల్ల ఇమ్యూనిటీ పవర్ తగ్చొచ్చు. ధైర్యంగా ఉండి వైద్యుల సూచనలతో మందులు తీసుకోండి.

 

గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందించాం. ఇది నిపుణులైన వైద్యుల చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మీకు ఎలాంటి ఆరోగ్య సమస్య తలెత్తినా వెంటనే వైద్యుడి సూచనలు తీసుకోవడం ఉత్తమం. మీ ఆరోగ్యానికి సంబంధించి పై కథనం విషయంలో ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.