చావు బతుకులనేవి ఎవరి చేతుల్లోనూ వుండవు. రాజకీయంగా ఎవరు ఎవర్ని ఎలా విమర్శించినా అది వేరే లెక్క. నోరుంది కదా.. అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఎలా.? పోసాని కృష్ణమురళి, బండ్ల గణేష్.. ఇద్దరూ ఇద్దరే. ఇద్దరికీ నోరు అదుపులో వుండదు. ఈ విషయం పలు సందర్భాల్లో నిరూపితమయ్యింది.
పోసాని కృష్ణమురళి ఇటీవల నోరు జారేసి, జుగుప్సాకరంగా సొంత కుటుంబ సభ్యుల మీద కూడా వ్యాఖ్యలు చేసేసి.. నవ్వులపాలైపోయిన సంగతి తెలిసిందే. పోసాని వ్యవహారంపై బండ్ల గణేష్ గుస్సా అయ్యాడు. ‘మా’ ఎన్నికల వ్యవహారంపై మాట్లాడుతూ, పోసాని వ్యవహారం చర్చకు వచ్చేసరికి.. బండ్ల గణేష్ తన మాట మీద అదుపు కోల్పోయాడు.
పోసాని చావు ఎంత భయంకరంగా వుంటుందంటే.. అంటూ దారుణమైన వ్యాఖ్యలు చేశాడు బండ్ల గణేష్. ఎవరు అధికారంలో వుంటే వారి పంచన పోసాని చేరతాడన్నది బండ్ల గణేష్ ఆరోపణ. రాజకీయాలన్నాక పార్టీలు మార్చడం పెద్ద వింతేమీ కాదు. పోసాని రాజకీయాలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలు కలిగి వున్నారు. టీడీపీ, ప్రజారాజ్యం పార్టీ, వైసీపీ.. ఇలా పార్టీ జెండాల్ని మార్చుతున్నాడాయన. అది ఆయనిష్టం.
బండ్ల గణేష్ కూడా ఒకప్పుడు కాంగ్రెస్ మనిషి. పవన్ కళ్యాణ్ అభిమాని. టీడీపీ నేతలతో సంబంధాలున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితితో సత్సంబంధాలు నడుపుతున్నాడు. ఎవరూ ఇక్కడ మిస్టర్ క్లీన్ కాదు. చావుల దాకా వెళ్ళే స్థాయికి వ్యాఖ్యలు చేయడం దిగజారుడుతనమే.