కేసీయార్‌పై మరోసారి బండి సంజయ్‌దే పై చేయి.!

వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఎలా మారబోతోంది.? అన్నది వేరే చర్చ. ప్రస్తుతానికైతే ప్రతి విషయంలోనూ బండి సంజయ్ ముందర తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఓటమినే చవిచూస్తున్నారు. గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికలు కావొచ్చు, హుజూరాబాద్ ఉప ఎన్నిక కావొచ్చు.. ప్రతిసారీ బండి సంజయ్‌దే పై చేయి అవుతోంది.

‘మేం నాగార్జున సాగర్ నియోజకవర్గంలో గెలిచాం..’ అని టీఆర్ఎస్ చెప్పుకోవచ్చుగాక. కానీ, గులాబీ పార్టీకి చెందిన రెండు నియోజకవర్గాల్ని బీజేపీ కబ్జా చేసింది. ఆ సంగతి పక్కన పెడితే, బండి సంజయ్ అనూహ్యంగా తెలంగాణ రాజకీయాల్లో సత్తా చాటుతున్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో బిజీగా వున్న బండి సంజయ్, ఈ విషయంలోనూ కేసీయార్ మీద పై చేయి సాధిస్తుండడం గమనార్హం.

ప్రజా సంగ్రామ యాత్రకు కేసీయార్ సర్కారు అనేక ఇబ్బందులు పెడుతుండగా, ప్రతిసారీ బండి సంజయ్, కేసీయార్ వ్యూహాల్ని తిప్పి కొడుతున్నారు.. పైచేయి సాధిస్తున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగనిచ్చేది లేదంటూ కేసీయార్ అండ్ టీమ్ అనేక వ్యూహాలు పన్నగా, అత్యంత వ్యూహాత్మకంగా కోర్టును ఆశ్రయించి అనుమతులు తెచ్చుకున్నారు బండి సంజయ్.

ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు విషయంలోనూ కేసీయార్ వ్యూహాల్ని దెబ్బకొట్టిన బండి సంజయ్, కోర్టు నుంచి ప్రత్యేక అనుమతి తెచ్చుకోవడం గమనార్హం. ఇలాంటివి రాజకీయాల్లో చాలా ఖరీదైన తప్పిదాలుగా మారుతుంటాయ్. ఇప్పటికే కసీయార్ సర్కారుకి చాలా డ్యామేజీ జరిగిపోయింది బండి సంజయ్ కారణంగా. తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ సమాజంలో పట్టు కోల్పోతోంది కూడా.

ఇక తెలంగాణ రాష్ట్ర సమితిని మర్చిపోవాల్సిందే.. అని బండి సంజయ్ అంత ధీమాగా చెబుతున్నారంటే, ఏమో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీయార్ ఇమేజ్ దారుణంగా డ్యామేజ్ అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.