బండి సంజయ్.. ఓ రెండేళ్ల క్రితం వరకు కూడా ఈయన పేరు ఎక్కువగా తెలియదు. కరీంనగర్ లో చోటా మోటా లీడర్ స్థాయి నుంచి నేడు దేశనేతగా ఎదిగారు బండి సంజయ్. కరీంనగర్ ఎంపీగా గెలవడమే కాదు.. బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడయి.. తెలంగాణలో బీజేపీ పాగ వేయడానికి ముఖ్యకారకుడు అయ్యారు. దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ గెలవడంలో, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన సీట్లు కానీ.. వీటన్నింటిలో బండి సంజయ్ పాత్ర మరువలేనిది. అందుకే బండి సంజయ్ పేరు ప్రస్తుతం ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రధాని మోదీ నుంచి అమిత్ షా వరకు అందరూ బండిని తెగ పొగిడారు.
పొగడటమే కాదు.. ఆయనకు ఢిల్లీ నుంచి పిలుపు కూడా వచ్చింది. బండి సంజయ్ అర్జెంట్ గా ఢిల్లీకి వెళ్లారు. కొత్త సంవత్సరం వేళ ఆయనతో ఏం చర్చిండానికి ఢిల్లీ నుంచి కబురు వచ్చిందో కానీ.. వెంటనే ఢిల్లీకి చెక్కేశారు బండి సంజయ్.
అయితే.. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు… ప్రస్తుతం తెలంగాణలో చోటు చేసుకున్న పరిస్థితులతో పాటు.. గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పీఠం విషయంలో బీజేపీ ఎలా ముందడుగు వేయాలో బండి సంజయ్ తో బీజేపీ అధిష్ఠానం డిస్కస్ చేయనుందని సమాచారం.
అందులోనూ బండి సంజయ్ త్వరలో బస్సు యాత్ర కూడా ప్రారంభించనున్నారు. ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలతో మాట్లాడి వచ్చారు. ఆయన ఢిల్లీ వెళ్లి వచ్చాక కేసీఆర్ లో కాస్త మార్పు కనిపించింది. కేంద్ర వ్యవసాయ చట్టాల మీద కూడా కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారు. అసలే తెలంగాణలో బీజేపీకి, టీఆర్ఎస్ కు పడదు. ఈ నేపథ్యంలో కేసీఆర్.. కేంద్రానికి మద్దతు ఇస్తుండటం ప్రస్తుతం అంతటా చర్చనీయాంశం అయింది. అందుకే… బండి సంజయ్ ని ఢిల్లీకి పిలిచి.. భవిష్యత్తులో ఎటువంటి అడుగు వేయాలో దిశానిర్దేశం చేయనున్నట్టు సమాచారం.