గ్రేటర్ ఎన్నికల జాతరలో జనసేన పార్టీకి పెద్ద షాక్ తగిలింది. పవన్ కళ్యాణ్ కట్టిన గాలి మెడలను బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూల్చివేయటమే కాకుండా బహిరంగంగా పరువు తీసేశాడు. గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మొదటి దశలో భాగంగా 50 డివిజన్స్ లో పార్టీ కమిటీలను ప్రకటించాడు పవన్ కళ్యాణ్.
బీజేపీ హస్తముందా
జనసేన నుండి అలాంటి ప్రకటన రావటంతో పవన్ కళ్యాణ్ వెనుక బీజేపీ హస్తముందని, గ్రేటర్ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పనిచేయబోతున్నాయని అనుకున్నారు, కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తమ పార్టీ నుండి అభ్యర్థులను ప్రకటిస్తున్నామని చెప్పటంతో , వామ్మో పవన్ కళ్యాణ్ లో ఇంత దైర్యం ఎక్కడ నుండి వచ్చింది. ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళటం అంటే సామాన్యమైన విషయం కాదు. అది గుండె కాదురా బాబోయ్ అంటూ జనసైనికులు పొంగిపోయారు. అయితే ఉన్నఫళంగా జనసేన నుండి ఒక ప్రెస్ నోట్ విడుదల అయ్యింది. గ్రేటర్ ఎన్నికల విషయంలో కలిసి పోటీచేసే దానిపై చర్చించటానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరికొందరు కలవబోతున్నారంటూ దాని సారాంశం. దీనితో జనసేన బీజేపీ పొత్తు ఉంటుందేమో అనుకున్నారు.
పవన్ తో బీజేపీ “పొత్తు”లాటలు
జనసేన లేఖ విడుదలైన కొద్దీ సేపటికే బండి సంజయ్ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. జనసేనతో ఎలాంటి పొత్తు ఉండబోదని మరోసారి స్పష్టంచేశారు.జనసేన రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ కు, తెలంగాణ బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారాయన. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించి దాదాపు అందరు అభ్యర్థుల్ని ఖరారు చేశామని.. కేవలం 2-3 డివిజన్లు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని, వాటిని కూడా మరికొన్ని గంటల్లో ఖరారుచేస్తామని బండి సంజయ్ విస్పష్టంగా ప్రకటించారు. ఇలాంటి టైమ్ లో పవన్ తో చర్చల ప్రక్రియ ప్రారంభించి ఉపయోగం లేదని కూడా ఆయన కుండబద్దలుకొట్టారు. దీనితో పవన్ కళ్యాణ్ పెట్టుకున్న ఆశలు ఆవిరైయ్యాయి. నిజానికి గ్రేటర్ లో సొంతగా పోటీచేసే సత్తా జనసేనను లేదు. కనీసం పోటీచేయడానికి కూడా సరైన అభ్యర్థులు కూడా లేరు. బీజేపీతో పొత్తు ఉంటుందనే ఉద్దేశ్యంతోనే పవన్ కళ్యాణ్ గ్రేటర్ ఎన్నికల జాతరలోకి వచ్చాడు, ఇప్పుడు ఇక బీజేపీతో పొత్తు లేదని తెలియటంతో ఈ రోజు తమ పార్టీకి చెందిన 27 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం వుంది.